- పనులు వేగవంతం చేయాలి
- అధికారులకు మంత్రి కొల్లు ఆదేశం
మచిలీపట్నం (చైతన్య రథం): మచిలీపట్నం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మచిలీపట్నం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ ఎం. నవీన్‌లతో కలిసి మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంగినపూడి తీరప్రాంతంలో రిసార్టుల ఏర్పాటు, 84 ఎకరాలలో పీతల పెంపకం, శాసన నిధులతో తాళ్లపాలెం వంతెన నిర్మాణం, తదితర భూ కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ పరిధిలోగల వివిధ రకాల భూసమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్‌తో చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో రూ.13 కోట్లతో చేపట్టిన అంతర్గత మురుగునీటి వ్యవస్థ పనుల పురోగతిని సమీక్షించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులు సాసి, భవ్య పథకాల కింద లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునే నిమిత్తం త్వరలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడైనా లీకేజీలు ఉంటే సరిచేయాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, వినియోగంపై మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, సర్వే భూరికార్డుల ఏడీ లక్ష్మణ్ బాబు, మచిలీపట్నం తహసీల్దారు నాగభూషణం, మచిలీపట్నం నగరపాలక సంస్థ సహాయ మున్సిపల్ కమిషనర్ గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
















