అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నాని సహాయం చేయడంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నాని సహాయంపై ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టింది. అడిగిన వెంటనే సాయం చేయడం పై ప్రశంసలు కురిపించింది. ‘మన పారిశుద్ధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత’ అనే నినాదంతో పవన్ ఆలోచనల నుంచి స్వచ్ఛ రథాలు పురుడుపోసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఈ స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛ రథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో నానికి పవన్‌కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు అంటూ పోస్ట్ పెట్టింది. ఈ స్వచ్ఛరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ.3.32 కోట్ల విలువ గల నిత్యావసరాలను ప్రజలకు అందించా యని చెప్పేందుకు ఆనందిస్తున్నామని తెలిపింది. భవిష్యత్తు తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం పాఠశాలల వద్దకు ఈ స్వచ్ఛరథాలు వెళ్లి.. పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పా టు సత్ఫలితాలను ఇస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ప్రారంభించామని డిప్యూటీ సీఎంవో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది.
















