అమరావతి (చైతన్య రథం): ఏపీకి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు శనివారం ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ.. “ప్రధాని మోదీ అధ్యక్షతన నడిచే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ధన్యవాదాలు. రాజమండ్రి (నిడదవోలు) -విశాఖపట్నం (దువ్వాడ) 3వ, 4వ రైల్వేలైన్లకు ఆమోదం తెలపడంపై కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల రైల్వే వంతెనతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి ప్రయాణ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ఈ ప్రాజెక్టులు వివిధ ప్రాంతాల్ని అనుసంధానించి ప్రయాణికులకు, సరుకు రవాణాకు దోహదం చేస్తాయి. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామంలాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రావడం సంతోషం. పారిశ్రామికవృద్ధి, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి ముఖ్యం. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాధన దిశగా ఈ ప్రాజెక్టులు మరో ముందడుగు” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.













