కుప్పం: కుప్పం నియోజకవర్గ పరిధిలో నిలిచిన హంద్రీ-నీవా సుజల స్రవంతి పనులను కుప్పం మండలం సలార్ల పల్లి వద్ద చంద్రబాబునాయుడు పరిశీలించారు. వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పనులు పూర్తి కాకపోవడంతోనే కుప్పంకు హంద్రీ-నీవా నీళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పనుల్లో భాగంగా మరో రూ.50 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే కుప్పంకు కూడా హంద్రీ- నీవా నీళ్లు అందేవని ఆయన వ్యాఖ్యానించారు. తాను అధికారం దిగిపోయిన తర్వాత మూడేళ్లుగా ఈ పనులను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువ నిర్మాణాలు ఎన్టీఆర్ కల. వాటిని సాకారం చేసేందుకు కాలువ గట్లపై నిద్రించి పనులు చేసాం. తమ హయాంలో రామకుప్పం వరకు కాలువల నిర్మాణాలు పూర్తి చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మాణాలు ఆగిపోయాయి. మొండి ప్రభుత్వం లాగే కాలువ నిర్మాణాలు ఆగిపోయి మొండిగా కనిపిస్తున్నాయి. వెంటనే నిర్మాణాలు పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నీళ్లివ్వాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.