- భూగర్భ డ్రైనేజి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ కూడా పూర్తి చేస్తాం
- వచ్చే ఏడాది వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం
- మంగళగిరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మొదలైంది
- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి
- మూడో విడత పట్టాల పంపిణీలో మంత్రి నారా లోకేష్
- మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో 372మందికి శాశ్వత పట్టాలు
తాడేపల్లి (చైతన్య రథం): మంగళగిరిలో 2029 ఎన్నికలలోపు ప్రతి గడపకీ తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజీ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటా. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నానని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా 372మందికి శాశ్వత పట్టాలు, పిఎంఎవై మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ప్రజల దశాబ్దాల కల. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేం తీసుకుంటాం. మహానాడు కట్టకి రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజి, తాగునీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఎన్నికల సమయంలో అడిగారు. వాటిని ప్రణాళికా బద్ధంగా చేపట్టి, పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.
అత్యధిక మెజారిటీ నా బాధ్యత పెంచింది
“నేను మంగళగిరిలో పుట్టకపోయినా 2019లో మంగళగిరి నా సొంత ఊరుగా భావించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేశా. ఇక్కడ ప్రజలను అర్ధం చేసుకునేలోపే ఎన్నికలు అయిపోయాయి. 5300 ఓట్ల తేడాతో నేను ఆనాడు ఓడిపోయా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. ఐదేళ్లు కష్టపడి మీ మనసు గెలుచుకొని ఇక్కడనుంచే శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎన్నికల ప్రచారంలో ఎన్ని ఓట్లతో నేను 2019లో ఓడిపోయానో, దానిపక్కన ఒక్క సున్నా పెట్టి ఆ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరా. మీరు నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంత బలం వస్తుంది. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని ఆనాడు హామీ ఇచ్చా. మీ ఆశీస్సులతో ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో విజయం సాధించా. నేను 53వేల మెజారిటీ అడిగితే, 92వేల ఓట్ల ఆధిక్యతతో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. మీరిచ్చిన మెజారిటీతో నా బాధ్యత పెరిగింది. ఆనాటి నుంచి అహర్నిశలు మంగళగిరి ప్రజల గురించే ఆలోచిస్తున్నా” అని లోకేష్ స్పష్టం చేశారు.
రూ.2వేల కోట్ల ఆస్తి పంపిణీ చేశాం
“2019 ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు మంగళగిరి ప్రజల ఇంటిపట్టాల సమస్యపై హామీ ఇవ్వాలని నన్ను కోరారు. ఆనాడు సమస్య అర్థం కాకపోవడంతో నేను హామీ ఇవ్వలేకపోయా. గత ఎన్నికల్లో గడపగడపకు వచ్చినపుడు దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్న వారితో మాట్లాడాక సమస్య అర్థమైంది. సొంత ఇల్లు ఒక ఎమోషన్. కుటుంబమంతా చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఆ ఇల్లు మీది కాదు, రేపు మాపో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రతిక్షణం భయపెట్టే పరిస్థితి ఆనాడు ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆనాడు నేను హామీ ఇచ్చాను. మూడోవిడత సుమారు 400 మందికి శాశ్వత పట్టాలు కల్పిస్తున్నది మీ కూటమి ప్రభుత్వం. బట్టలు పెట్టి పసుపు, కుంకుమలతో పట్టాలు ఇస్తానని ఆనాడు ఇచ్చిన హామీ ఈరోజు నిలబెట్టుకుంటున్నా. మొదటి విడతలో 3,002, ໐໕ 2,670, మూడోవిడతలో 388 పట్టాలు కలిపి మొత్తం సుమారు రూ.2వేల కోట్ల విలువ ఆస్తికి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించింది ప్రజాప్రభుత్వం” అని లోకేష్ ప్రకటించారు.
రాష్ట్రానికి దిక్సూచిగా మంగళగిరి మోడల్
“మంగళగిరిలో మొదటి పెట్టిన ప్రక్రియ ఈరోజు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. మంగళగిరిలో పట్టాల సమస్యను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సి ఉందని నాతో చెప్పారు. అధికారులు,
నాయకుల కనీసం ఒక్క గ్లాసు మంచినీరు కూడా తీసుకోకుండా ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేమంతా ఒక పట్టుదల, కమిట్మెంట్ పనిచేస్తున్నాం. మంగళగిరిలో వేసిన పునాది ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా మారింది. ఇటీవల విశాఖపట్నంలో 29వేల పట్టాలను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించింది. త్వరలో విజయవాడలో కూడా మరో 24వేలమందికి అందించబోతోంది. ఇది గౌరవ ముఖ్యమంత్రికి పేదలపట్ల ఉన్న కమిట్మెంట్” అని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిడమర్రు స్కూలు
“ఇంకో పక్కన విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చా. కానీ సొంత నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏదోకటి చేయాలన్న ఉద్దేశంతో నిడమర్రు స్కూలును భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తీర్చిదిద్దటం జరిగింది. మొన్న మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళితే నిడమర్రు స్కూలులో వారి బిడ్డకు సీటు కావాలని నాతో గొడవపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మంగళగిరి నుంచే మొదలైంది. ఇది కేవలం ఒక నిడమర్రు స్కూలు కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇదేవిధంగా తయారుచేయాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం. సురక్షితమైన తాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గుడులు, చర్చిలు, మసీదులను కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేస్తోంది. స్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం” అని లోకేష్ వివరించారు.
ఎక్కువ హామీలు ఇవ్వను… ఇచ్చినవన్నీ నిలబెట్టుకుంటా
“నేను ఎక్కువ హామీలు ఇవ్వను. కానీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా. డోర్ టు డోర్ కార్యక్రమం సమయంలో మీరు చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నా. ప్రతిదీ నేను మానిటర్ చేస్తున్నా. పురోగతిపై ప్రతివారం సమీక్ష చేస్తున్నా. దాంట్లో భాగంగా ఇంటి పట్టాల కార్యక్రమం చేపట్టాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలున్నాయి. యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన పనులన్నీ తొలుత చేపడుతున్నాం. భూగర్భ డ్రైనేజీ, పైప్లాన్ ద్వారా తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియ పూర్తయిన చోట వెంటనే రోడ్లు వేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
















