- 45 నిమిషాలపాటు సాగిన సమావేశం
- ఉక్కు ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు
- అమరావతి, పోలవరం నిధులపైనా చర్చ
ఢిల్లీ (చైతన్య రథం): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢల్లీి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు కొనసాగిన భేటీలో.. రాష్ట్రానికి ఆర్థిక సహకారంపై సీఎం చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరపున విజ్ఞప్తులను ఆమె ముందుంచారు. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి సీఎం ప్రస్తావించినట్టు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికపై పోస్టు పెడుతూ.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్రాభివృద్ధి, పోలవరం, అమరావతిపై చర్చించాం. విశాఖ ఉక్కుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపాం’ అని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదిలావుంటే, దావోస్ పర్యటన ముగించుకుని అర్థరాత్రి ఢల్లీి చేరుకున్న సీఎం విమానాశ్రయంలో ఇండోనేషియా వైద్యశాఖ మంత్రి బుడి సాదికిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. ‘రేపటి మూల స్తంభాలుగా నేటి ఆడబిడ్డలు ప్రకాశించేలా చేస్తాం. ఆడబిడ్డల భద్రత, శ్రేయస్సుకే మా ప్రథమ ప్రాధాన్యత. సమాన అవకాశాలు కల్పిస్తూ మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా భవిష్యత్‌ను నిర్మించేందుకు కట్టుబడి ఉన్నా’మని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.