- హామీలన్నీ తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు
- పరిశ్రమలను తరిమేసి రాష్ట్రానికి వెన్నుపోటు
- ఉద్యోగ నోటిఫికేషన్లపై మడమ తిప్పి యువతకు వెన్నుపోటు
- అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్ని పాడుబెట్టి మరో వెన్నుపోటు
- కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన
- జగన్ కుట్రలు, కుతంత్రాల పట్ల ప్రజలు అప్రమత్తం
- మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
మంగళగిరి (చైతన్య రథం): ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన జగన్ రెడ్డిని మించిన వెన్నుపోటుదారుడు రాష్ట్రంలో మరొకరు లేరని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. గొడ్డలివేటుకు, వెన్నుపోటుకు జగన్‌రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఈమేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అన్నారు. బాబాయి హత్య కేసులో నిందితులకు కొమ్ము కాస్తూ తోడబుట్టిన చెల్లిపైనే తిరిగి నిందలేసిన నీచుడు జగన్‌రెడ్డి అని విమర్శించారు. ఐదేళ్ల అరాచక పాలన, మోసం చూసిన ప్రజలు ఈ సైకో మాకొద్దని కూటమికి 94 శాతం సీట్లతో గెలిపించారు. 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ సిగ్గులేకుండా ఇంకా కుట్రలనే నమ్ముకున్నాడని, నిబద్ధతతో ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వంపై నీచమైన కుతంత్రాలకు పాల్పడుతున్నాడని మంత్రి విమర్శించారు.
అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన జగన్‌రెడ్డి, అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టాడన్నారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని గాలికి వదిలేసి కల్తీ బ్రాండ్లు, సొంత బ్రాండ్లతో ప్రజల జేబులకు చిల్లుపెట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నాడని, సుమారు రూ.3,500 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. జగన్‌రెడ్డి కల్తీ మద్యంతో 30 వేలమందికి పైగా మహిళల మాంగళ్యాలు తెంపాడని, లక్షలాది మంది కిడ్నీ, లివర్, లంగ్స్, మెదడు సమస్యలతో ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నారని పేర్కొన్నారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తానన్న హామీకి తిలోదకాలిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని మంత్రి అన్నారు.
విద్యుత్ ఛార్జీలు 9సార్లుపెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై నేరుగా మోపాడని, పీపీఏలు రద్దు చేసి విద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్ల నష్టం చేకూర్చి ఆ భారాన్ని కూడా ప్రజల నెత్తిన వేశాడని ఆరోపించారు. మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో యువతకు వెన్నుపోటు పొడిచాడని, జగన్ రెడ్డి దగాకోరు మాటల కారణంగా గత ఐదేళ్లలో ఏకంగా 4,100 యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అందరికీ అమ్మఒడి హామీని గాలికొదిలి కొందరికే అంటూ విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడని, జీవో నెం.117 తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దగ్గరగా ఉండే స్కూళ్లను రద్దు చేసి చదువులు దూరం చేశాడని మంత్రి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆ జీవోను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజల చదువులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వందలాది సంక్షేమ పథకాలు రద్దు చేశాడని, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కుదించి వెన్నుపోటు పొడిచాడని అన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కంటే రూ.1,000 ఎక్కువ జీతం ఇస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచాడని, సాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేశాడని, పొరుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గించి రాష్ట్ర రైతాంగానికి వెన్నుపోటు పొడిచాడని మంత్రి రవీంద్ర విమర్శించారు. అమరావతే రాజధాని అని ఎన్నికలకు ముందు చెప్పి గెలిచాక మూడు రాజధానులు, మావిగన్ అంటూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడని, రాజధాని రైతుల్ని లాఠీలతో కొట్టించాడని అన్నారు. తండ్రి ఆస్తిలో వాటా అడిగినందుకు తోడబుట్టిన చెల్లిని, చెల్లికి అండగా నిలిచినందుకు కన్న తల్లిని ఇంట్లో నుంచి గెంటేశాడని, బాబాయి హత్య కేసులో నిందితులకు అండగా నిలిచి సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచాడని మంత్రి ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్రం నుండి అదనపు నిధులు రప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని, అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ వంటి అభివృద్ధిని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని అన్నారు.
గతంలో ఏపీలో పెట్టుబడి అంటేనే భయపడే పరిస్థితి నుండి ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం వస్తే చాలు అనేలా ఏపీ బ్రాండ్ ఇమేజ్ అభివృద్ధి చేశామని, 25కి పైగా పాలసీలు తీసుకొచ్చి పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచామని, రెండేళ్లలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చేలా చేశామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమం, ప్రతి ఒక్కరికీ ఉపాధి నినాదంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, మత్స్యకారుల సేవలు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని, రైతులకు 24 గంటల్లోనే మద్దతు ధర అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దీపం 2 పథకంతో 4.26 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించామని, 71 కోట్ల మంది ఉచిత బస్సుతో లబ్ది పొందారని, 269 అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించామని చెప్పారు. గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్, 50 శాతం సబ్సిడీ కల్పించామని, వడ్డెరలకు బిల్డింగ్ మెటీరియల్ క్వారీల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామని, నాయీ బ్రాహ్మణ, రజకులకు 200 యూనిట్లు, చేనేతల మరమగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూంకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని మంత్రి రవీంద్ర అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ అభివృద్ధి బాటలో నడుస్తున్నామని తెలిపారు. 16,400 డీఎస్సీ, 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలిచ్చామని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పరిశ్రమలు రప్పిస్తున్నామని చెప్పారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. జగన్ రెడ్డి 25 లక్షల ఇళ్ల పేరుతో రూ.7,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని, కానీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల ఇళ్లు ఇచ్చిందని, మరో 5 లక్షల ఇళ్లు అందించబోతున్నామని తెలిపారు. 90 శాతానికి పైగా హామీలను అమలు చేశామని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలిచ్చిన అధికారాన్ని వాడుకుని జగన్ రెడ్డి తన జేబులు నింపుకోవడం తప్ప చేసిందేమీ లేదని, సంక్షేమంలో మోసం, అభివృద్ధి శూన్యం అని మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా చూస్తుంటే జగన్ రెడ్డి కుట్రలు చేస్తూ రాష్ట్రంలో అలజడులకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. మళ్లీ గొడ్డలి పార్టీ మోసం చేయడమే లక్ష్యంగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు. క్రూర మనస్తత్వం కలిగిన జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులను రాజకీయంగా సమాధి చేయాలని, ఈ విషయంలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి గొడ్డలి పార్టీని భూస్థాపితం చేద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.














