- పర్యావరణం, నీటి నిర్వహణ, సాంకేతికత…
- ప్రపంచస్థాయి విధానాలపై మంత్రుల బృందం అధ్యయనం
- అమరావతి అభివృద్ధికి అంతర్జాతీయ అనుభవాల అన్వయం
- కృష్ణాతీరం అభివృద్ధికి మెరీనా బ్యారేజ్ మోడల్ పరిశీలన
సింగపూర్/ అమరావతి (చైతన్య రథం): ఏపీని సుస్థిర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో సింగపూర్‌లో పర్యటిస్తున్న మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాల్గవరోజూ కీలకంగా సాగింది. ప్రపంచంలో అత్యుత్తమ నగర పాలన, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ, సాంకేతిక వినియోగంవంటి రంగాల్లో సింగపూర్ సాధించిన విజయాలను లోతుగా అధ్యయనం చేస్తూ, వాటిని రాష్ట్రంలో అమలుచేసే మార్గాలను మంత్రులు పరిశీలిస్తున్నారు. సింగపూర్ ప్రభుత్వ విధానాలపై పీఎంవో మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీ సే మంత్రుల బృందానికి సమగ్రంగా వివరించారు. దేశ ప్రయోజనాలను ప్రధానంగా ఉంచుకుంటూనే సమాజంలోని ప్రతివర్గాన్ని భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగే ‘నేషన్ ఫస్ట్ నుంచి వియ్ ఫస్ట్” దృక్పథం సింగపూర్ అభివృద్ధికి పునాది అయిందని వివరించారు. ప్రజలు, ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలు సమన్వయంతో పనిచేయడం ద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని, దీర్ఘకాలిక ప్రణాళికలు, పారదర్శక పరిపాలన, నిబద్ధత మరియు నిజాయితీవంటి విలువలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాయని వివరించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, సమర్థమైన గవర్నెన్స్‌కు మోడల్
నియోజకవర్గస్థాయిలో ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే వ్యవస్థలు, స్థానిక సమస్యలను ముందుగానే గుర్తించి తక్షణమే చర్యలు తీసుకునే విధానాలు సింగపూర్‌లో ఎలా అమలవుతున్నాయో మంత్రులు విశ్లేషించారు. ఈ విధానాలు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కూడా ఇలాంటి వ్యవస్థలను బలోపేతం చేస్తే ప్రజా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
మెరీనా బ్యారేజ్ సందర్శన, నీటి నిర్వహణలో ప్రపంచానికి ఆదర్శం
సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రుల బృందం ప్రముఖ మెరీనా బ్యారేజ్‌ను సందర్శించింది. తాగునీటి సరఫరా, వరద నియంత్రణ, పర్యాటక అభివృద్ధి ఈ మÖడు అంశాలను సమన్వయం చేస్తూ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ సింగపూర్ నీటి నిర్వహణలో కీలక భాగంగా నిలిచింది. ఈ సందర్భంగా నేషనల్ యÖనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ‘ఎన్‌యుఎస్ సిటీస’ డైరెక్టర్ ఖూ టెంగ్ చై, పర్యావరణ అనుకూల విధానాల ద్వారా సింగపూర్ నీటి సమస్యలను ఎలా అధిగమించిందో వివరించారు. గ్రీన్ రూఫ్ సాంకేతికత, పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణాలు, ఆధునిక నగర ప్రణాళికలు సింగపూర్‌ను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయని మంత్రులు గమనించారు. మెరీనా బ్యారేజ్ పరిసరాలు, మెరీనా బే సాండ్స్‌వంటి నిర్మాణాల వీక్షణ స్థలంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతున్నట్లు గుర్తించారు.
అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్, కృష్ణా నదితీరంపై కొత్త ఆలోచనలు
సింగపూర్‌లో చూసిన అభివృద్ధి నమÖనాలను కృష్ణా నదితీరం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో అమలు చేసే అవకాశాలపై మంత్రులు చర్చించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే నీటి వనరులను సమర్థంగా వినియోగించడం, వరద నియంత్రణ చర్యలు, ప్రజలకు వినోదం మరియు జీవన ప్రమాణాలు పెంచే విధానాలను అమలు చేయాలనే దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా పొందిన అనుభవాలు రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని మంత్రులు భావిస్తున్నారు. సింగపూర్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం ప్రపంచ స్థాయి పరిపాలన, పర్యావరణ పరిరక్షణ, నీటి నిర్వహణ మరియు నగర అభివృద్ధి రంగాల్లో విలువైన అనుభవాన్ని సొంతం చేసుకుంటోంది. ఈ అనుభవాలను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. ఈ శిక్షణ మరియు అధ్యయన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.
















