- మేలుకో ఆంధ్రుడా… ఎన్నాళ్లీ కుల, మతాలపేరుతో కుంపట్లు?
- సింగిల్ నోటిఫికేషన్‌తో ఉద్యోగాలు భర్తీచేస్తాం
- చేసిన తప్పుకు జగన్ ను వదిలిపెట్టం…చట్టపరిధిలో చర్యలు తప్పవు
- ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు… గుండెల్లో పెట్టుకుంటాం
- నంద్యాల యువగళం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్
నంద్యాల(చైతన్యరథం): యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రలో నేను చూసిన ప్రజల కష్టాలను చంద్రబాబునాయుడు, పవనన్నకు చెప్పాను, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, వారి కన్నీళ్ల నుంచే కూటమి మేనిఫెస్టో తయారైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. నంద్యాల రాణి-మహారాణి గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రముఖ జర్నలిస్టు షేక్ నిజాం వ్యాఖ్యాతగా వ్యవహరించిన యువగళం సభలో లోకేష్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోకు బీజేపీ ఆమోదం లేదంటున్న వాదనను తిప్పికొట్టారు. జాతీయపార్టీగా బీజేపీకి మేనిఫెస్టో ఉంటుందని, ఎన్డీఏ మిత్రపక్షాలు ఉన్నచోట్ల ప్రత్యేక మేనిఫెస్టో ఉంటుందని బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేశారు. మేలుకోండి ఆంధ్రులారా… మనకు ఆత్మగౌరవం, పట్టుదల లేవా? రాజధానిని నిర్మించుకోలేమా? ఎన్నాళ్లు కులం, మతం పేరుతో చీలికలు? మనందరం గర్వపడేలా రాజధాని నిర్మించుకోవాలి. ఉద్యోగం, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితి మారాలి. ఈసారి ఎన్నికల్లో 40లక్షలమంది తొలిసారి ఓటర్లు ఉన్నారు. మీ ఓటుపైనే రాష్ట్ర భవిత ఆధారపడి ఉంది. కలసికట్టుగా కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోండి. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసంతకం మెగా డీఎస్సీపైనే. యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్ తెస్తాం. ప్యూన్ నుంచి గ్రూప్-1 వరకు సింగిల్ నోటిఫికేషన్‌తో క్యాలెండర్ ఇస్తాం. అయిదేళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీచేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
జగన్ చేసిన తప్పుకు చర్యలు తప్పవు!
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ జగన్మోహన్ రెడ్డిని, వైకాపా నాయకులను ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ తప్పూ చేయని చంద్రబాబునాయుడును 53 రోజులు జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నా, బయట ఉన్నా సింహం సింహమే. అందుకే జగన్ ను వేటాడేందుకు వచ్చింది ఆ సింహం. జగన్‌ను చంద్రబాబు వదిలిపెట్టరు. చేసిన ప్రతి తప్పుకు మేం చర్యలు తీసుకుంటాం, మీ తరపున పోరాడినందుకు నాపై 23కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా. ఈ లోకేష్ తగ్గేదే లేదని. బాంబులకే భయపడలేదు, చిల్లరకేసులకు భయపడతామా? జగన్ భయం మా బ్లడ్ లో లేదు. మరో నెలరోజులు మాత్రమే. నెలలో అప్పుల అప్పారావు తాడేపల్లి కొంపలో ముసుగు వేసుకొని పడుకోవడం ఖాయం. అయిదేళ్లలో ప్రజలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేసే బాధ్యత తనదని లోకేష్ అన్నారు.
ముస్లిం సోదరులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
వాజ్ పేయి హయాంలో, 2014లో బిజెపితో మేం కలిసి పనిచేశాం. ముస్లింలు ఏనాడైనా ఇబ్బంది పడ్డారా?అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. జగన్ ప్రభుత్వ హయాంలో నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పలమనేరులో మిస్బా అనే బాలికను ఆత్మహత్యకు ప్రేరేపించారు. రాష్ట్రంలో వేలాదిమంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు జరిగాయి. చంద్రబాబు హయాంలో ఒంగోలు జిల్లాలో ఒక మైనారిటీ బాలికపై అత్యాచారం జరిగితే భయపడి నిందితుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గూండాలు, రౌడీషీటర్లు, కామాంధులకు చంద్రబాబు అంటే భయం. మేం అధికారంలోకి వచ్చాక ముస్లిం సోదరులను వేధించిన రౌడీలను వదిలిపెట్టం. ఎంక్వయిరీ వేస్తాం, ఆయా ఘటనల వెనుక ఉన్నవారందరికీ శిక్ష పడే బాధ్యత నేను తీసుకుంటా. మైనారిటీల్లో నిరుపేదలు అధికంగా ఉన్నారు. మైనారిటీ సోదరులకోసం ఎన్టీఆర్ తొలిసారి మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో హజ్ యాత్రకు సబ్సిడీ, రంజాన్ తోఫా, మసీదులకు రంగులకు డబ్బులు, దుల్హాన్ పథకం ఇచ్చారు. ఇవన్నీ ఎన్నికల కోసం చేసింది కాదు. చిత్తశుద్ధితో ముస్లింలో పేదరిక నిర్మూలనకు కృషిచేశారు. పార్లమెంటులో సీఏఏ బిల్లు ప్రవేశపెట్టినపుడు వైసీపీ ఎంపీలంతా ఓట్లువేశారు. సీఏఏ ను సమర్థిస్తూ విజయసాయి కూడా మాట్లాడారు. వైసీపీి నాయకుల తప్పుడు ప్రచారంపై ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు.
వందరోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం
చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి నడుమ వ్యత్యాసాన్ని యువత ఆలోచించాలి. చంద్రబాబు నిర్మిస్తే, జగన్ కూలగొట్టాడు. అమరావతిని విధ్వంసం చేశారు. చంద్రబాబు పోలవరం 72శాతం పూర్తిచేస్తే జగన్ నాశనం చేశారు. పేదప్రజలకు చంద్రబాబు టిడ్కో ఇళ్లుకడితే జగన్ తన ఇంటిముందు పేదల ఇళ్లు కూలగొట్టారు. అనంతబాబు, విజయసాయి, జగన్ కలిసి గంజాయిని అరకులో పండిరచి రాష్ట్రంలో వీధివీధినా అమ్ముతున్నారు. ఆ సొమ్మంతా తాడేపల్లి కొంపకు వెళ్తుంది. గంజాయితో ఒక తరం నాశనం అవుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో నన్ను ఒక తల్లి కలిశారు. గంజాయికి బానిసను చేసి తన కుమార్తెను 40రోజలు వాడుకున్నారని కన్నీళ్లు పెట్టింది. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా గంజాయే. గంజాయి మత్తులో ఎమ్మెల్సీ అనంతబాబు.. దళితడ్రైవర్ సుబ్రహ్మణ్యంను కొట్టిచంపి, శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపి కన్పించకుండా చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ కుట్ర
ముఖ్యమంత్రి జగన్ అప్పుల అప్పారావు మాదిరి తయారయ్యారు. ప్రభుత్వానికి చెందిన స్థలాలు సచివాలయం, అసెంబ్లీ, మనం నడిచే రోడ్లు కూడా తాకట్టుపెట్టారు. మన భూములను తాకట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాతముత్తాతలు, తల్లిదండ్రులు ఇచ్చిన భూముల సర్వేరాళ్లపైన, పాస్ బుక్కులపై అప్పుల అప్పారావు ఫోటోలు వేస్తున్నారు. తాజాగా ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టంతో అనేక అనేక ఇబ్బందులు ఉన్నాయి. అధికారులే వివాదాలు పరిష్కరిస్తారట. కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేదు. ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది. ఇళ్లు, భూములు వైసీపీ నాయకుల పేరుపై రాసేందుకే ఈ నల్ల చట్టం. అందుకే ఈ చట్టాన్ని రద్దుచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ మీ భూములు తీసుకుని తాకట్టు పెట్టడానికి ఇటీవల మీ బిడ్డనంటున్నాడు… పొరపాటున ఓటువేస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని లోకేష్ హెచ్చరించారు.
31మంది ఎంపీలను ఇస్తే ఏం సాధించారు?
2014లో ఏపీ విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి బయటకు గెంటారు. 62 సంవత్సరాలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. అసెంబ్లీ, సచివాలయం హైదరాబాద్ లోనే ఉండిపోయాయి. ఆనాడు 5కోట్లమందిని ఒప్పించి చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రతిరోజూ పెట్టుబడుల వార్తలే కన్పించేవి, ఫాక్స్‌కాన్, సెల్ కాన్, కియా వంటి పరిశ్రమలతో 6లక్షలమందికి ఉద్యోగాలు వచ్చాయి. 15లక్షల కోట్ల పెట్టుబడులు, 35లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందం చేసుకున్నాం. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు, జైన్ ఇరిగేషన్, మెగా సీడ్‌పార్కు, సోలార్ పవర్, ఉర్దూ యూనివర్సిటీ తెచ్చింది తెలుగుదేశం పార్టీ. 2019లో ఒక్క అవకాశం మాయలో పడి మోసపోయాం. జగన్ కు ఒక్క అవకాశమిస్తే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తానని అన్నాడు. మెగా డిఎస్సీ అన్నాడు, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ అన్నాడు. అయిదేళ్లలో ఒకే ఒక జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారు. వైసిపికి గత ఎన్నికల్లో 31మంది ఎంపిలను ఇస్తే ఏనాడైనా రాష్ట్రం సమస్యలపై మాట్లాడారా? ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిననిధుల గురించి ఎందుకు మాట్లాడలేదని లోకేష్ ప్రశ్నించారు.
రాయలసీమలో పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
జగన్ మూడుముక్కలాటతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మూడురాజధానులని కర్నూలులో ఒక్క ఇటుక వేయలేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖలో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. అదే డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయ్యేవి. జగన్ వచ్చాక పిపిఎలు రద్దుచేశారు. అమర్‌రాజా, లులూ వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. ఈనాడు ఏపీ యువత ఉద్యోగాల కోసం పక్కరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. 2019లో కర్నూలు జిల్లాలో 2 ఎంపిలు, 14 మంది ఎమ్మెల్యేలు వైసిపికి ఇచ్చారు. ఒక్క పరిశ్రమ, ఒక్క ఉద్యోగం, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తిచేశారా? యువగళం పాదయాత్రలో రాయలసీమ కష్టాలు చూశాకే మిషన్ రాయలసీమ ప్రకటించాను. రాయలసీమను ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా మారుస్తాం. పెండిరగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి సస్యశ్యామలం చేస్తాం, 90శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తాం. రెన్యువల్ ఎనర్జ్జీ, స్పోర్ట్స్‌హబ్ గా తీర్చిదిద్దుతాం. పాడిరైతులను ఆదుకుంటాం. యువకులను మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే. పెండిరగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. సూపర్ సిక్స్ లో మొదటిహామీ 20లక్షల ఉద్యోగాల బాధ్యత మేం తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చేవరకు యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ చెప్పారు.
ఫరూక్,శబరిలను గెలిపించండి
నంద్యాల యూత్ పవర్ అదిరిపోయింది. నందీశ్వరులు తపసు చేసిన నేల నంద్యాల. స్వాతంత్య్రయోధులు ఉయ్యాల నరసింహారెడ్డి నడయాడిన నేల, పివి నరసింహరావును దేశానికి ప్రధానిని చేసిన గడ్డ నంద్యాల గడ్డ. ఈ గడ్డపై యువగళం యాత్ర చేశా. ఈ రోజు యువగళం సభలో పాల్గొనడం ఆనందంగా ఉంది.2014-19 మధ్య రూ.1500 కోట్లతో నంద్యాలను అభివృద్ధి చేశాం. 10వేల టిడ్కో ఇళ్లు కట్టించాం. అయినా 2019లో సండే ఎమ్మెల్యేని గెలిపించారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక్క పరిశ్రమ రాలేదు. ఎంపి బ్రహ్మానందరెడ్డి వల్ల కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోయారు. అధికారంలోకి వచ్చాక కల్తీ విత్తనాలపై చర్యలు తీసుకుంటాం. రాబోయే ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్, ఎంపి అభ్యర్థి శబరిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. శబరి ఒక డాక్టర్. నంద్యాల గళాన్ని పార్లమెంటులో విన్పిస్తారు. ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. ప్రశాంతతకు మారుపేరైన నంద్యాలలో వైసిపి వచ్చాక 15 హత్యలు జరిగాయి. కానిస్టేబుల్ సురేంద్రను తరిమితరిమి చంపారు. మళ్లీ నంద్యాల ప్రశాంత నిలయంగా మారాలంటే ఫరూక్, శబరిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్ పిలుపు ఇచ్చారు.
లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన నంద్యాల ముస్లిం ప్రముఖులు
ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు కలిసిరావాలన్న నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్ ఆధ్వర్యంలో ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీకి చెందిన షేక్ అబ్బాస్ తో పాటు 100 మంది అనచరులు, మాజీ కౌన్సిలర్ షేక్ మూర్తజావలి శుక్రవారం లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. నంద్యాల పట్టణం ఎస్‌ఎన్ కల్యాణ మండపంలోని యువగళం క్యాంప్‌లో వీరందరికీ పసుపు కండువాలు కప్పి యువనేత పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల పట్ల వైకాపా చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ హయాంలో రంజాన్ తోఫాతో పాటు దుల్హన్ పథకం, రంజాన్ సమయంలో మసీదుల మరమ్మతులకు నిధులు, షాదీఖానాలు, హజ్ యాత్రకు వెళ్లేవారికి సబ్సిడీ అందించాము. వచ్చే కూటమి ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల అండగా నిలుస్తాం. పార్టీలో చేరిన వారు తెలుగుదేశం విజయానికి కృషిచేయాలని కోరారు.