అమరావతి (చైతన్య రథం): కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. రాజేంద్ర మృతిపై తీవ్ర సానుభూతి వ్యక్తం చేసిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. రాజేంద్ర కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, పార్టీ తరఫున మరో రూ.10 లక్షలు.. మొత్తంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. కష్టకాలంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు కుప్పం టీడీపీ నాయకులు రాజేంద్ర నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.



















