- రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి
- కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు
- ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు
- ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
నెల్లూరు (చైతన్యరథం): పట్టుదలకు పోకుండా పగలు పక్కనబెట్టి రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో సర్పంచ్‌లను ఎన్నుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. గ్రామ పంచాయతీల్లో పోటీ లేకుండా సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందటంతో పాటు, కక్షలు..కార్పణ్యాలు లేకుండా అందరూ సోదరభావంతో గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం వస్తుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున జనాభాను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు వస్తాయన్నారు.
నెల్లూరులో ఆదివారం మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ జిల్లా అధ్యక్షుడి మాటలు విని పంచాయతీల్లో పోటీ చేస్తే మిగిలేది కక్షలు, అప్పులేనని హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచామని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు..ఇప్పుడు బ్యాలెట్లతో జరిగిన ఎన్నికల్లోనూ అంతక మించి ఫలితాలు వస్తున్నాయి. వీటిపై వైసీపీ నేతలు ఏమంటారో అన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగబట్టే కడప, పులివెందుల ప్రాంతంలోనూ ప్రజాస్వామ్యం గెలిచింది. పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయి కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 94 శాతం స్టైక్ రేట్ తో 175కి 164 సీట్లను గెలుచుకున్నాయి. అప్పుడు వైసీపీ నేతలు ఈవీఎంలు, ఈవీఎంలు అని గొంతు చించుకున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ క్లీన్ స్వీప్ చేసేశాయి. 40 ఏళ్ల తర్వాత కడప, పులివెందుల ప్రాంతంలో అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరిగింది. మొన్నటి ఎన్నికల వరకు అక్కడ అంతా దుర్మార్గాలే..నామినేషన్లను వేయనిచ్చేది లేదు…ప్రజలకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించే అవకాశమే ఉండేది కాదని సోమిరెడ్డి తెలిపారు.
ఏకగ్రీవం..గ్రామాలకు మేలు
ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమైనవి..గ్రామాల్లో అందరూ కూర్చుని రాజకీయాలకు అతీతంగా సర్పంచ్ లను ఎన్నుకుంటే కచ్చితంగా ప్రోత్సహించాలి. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. 5 వేలు లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేలు లోపు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలు ఆలోచించాలి. వైసీపీ జిల్లా అధ్యక్షుడేమో ప్రతి పంచాయతీలో పోటీ ఉండాల్సిందే..పోటీ పడాల్సిందే..తన్నుకోవాల్సిందే..లక్షలు ఖర్చుపెట్టాల్సిందే…అప్పులు పాలుకావల్సిందేనని స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడు.
ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి రాజకీయాలు మేం చేయలేదు..చేయం కూడా…గత పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీల విషయంలో బలవంతం చేయలేదు. పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికల్లోనే పులివెందులలో సైతం వైసీపీ చేతులెత్తేసింది..ఇప్పుడు పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికల్లో మాత్రం రెచ్చగొడుతున్నారు. ఏకగ్రీవాల విషయంలో అన్ని పార్టీల నాయకులు సానుకూలంగా ఆలోచించాలని కోరుతున్నాను. పంతాలకు పోయి పోటీలు పెట్టి, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకోవడంతో పాటు కక్షలు పెంచుకుంటే ఫలితం లేదు. దయచేసి అందరూ రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధి గురించి ఆలోచించి ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. పంచాయతీలు ఏకగ్రీవం అయితే ప్రశాంత వాతావరణంలో పల్లెలను అభివృద్ధి చేసుకనే అవకాశం ఉంటుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీలతో పాటు మండల పరిషత్‌లు, జెడ్పీలకు ఒక్క రూపాయి డైవర్ట్ కాకుండా నిధులు వస్తాయి. అందరూ సానుకూల దృక్ఫథంతో ఆలోచించి ఏకగ్రీవాల దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరారు.




















