- పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు
- గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి
- ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా
- పార్టీ నేతల మధ్య పంతాలు, ఈగోలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలి
- మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అమరావతి (చైతన్య రథం): గ్రామాల అభివృద్ధికి దోహదపడేలా పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. పార్టీ గుర్తులపై జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఇక పంచాయతీ ఎన్నికలను గ్రామాభివృద్ధికి వేదికగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రానున్న పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాల ప్రోత్సాహంపై ఆదివారం మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని, పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం ఉందని, స్థానిక ఎన్నికల ఫలితాలు ఆ నమ్మకాన్ని మరోసారి చాటాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూటమికి అనుకూలంగా ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. అందుకే ఇప్పటికీ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ప్రజాభిమానాన్ని ఓట్ల రూపంలోకి మలుచుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.
ఏకగ్రీవాలకు భారీ ప్రోత్సాహకాలు
పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగే ఇతర స్థానిక సంస్థల ఎన్నికలకు భిన్నమైనవని సీఎం స్పష్టం చేశారు. పార్టీల మధ్య రాజకీయ పోటీకి అతీతంగా గ్రామాల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకోవాలని చెప్పారు. గ్రామస్థులందరి ఆమోదంతో పంచాయతీలు ఏకగ్రీవమైతే, ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నిధులతో స్థానికంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు అందించే విషయాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు కనిష్ఠంగా రూ.5 లక్షలు, గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకం ఉండేదని, ప్రస్తుతం కనిష్ఠ మొత్తాన్ని రూ.15 లక్షలకు, గరిష్ఠ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ నిధులు గ్రామాలకు అందితే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని వివరించారు.
గ్రామస్థాయి నేతలతో సంప్రదింపులు జరపాలి
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి గ్రామస్థాయి నాయకుల్లో ఎక్కువగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకే పార్టీలోని నాయకులు కూడా పరస్పరం పోటీ పడే పరిస్థితులు ఉంటాయని, అటువంటి వారితో ముందుగానే మాట్లాడి ఏకాభిప్రాయానికి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో వ్యక్తిగత పట్టుదలలు, రాజకీయ ఆధిపత్య పోరుకు బదులుగా సమష్టి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పార్టీలో నేతల మధ్య పంతాలు, ఈగోలకు తావులేకుండా ఐక్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపాలని, ఏకగ్రీవాల వల్ల గ్రామాలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆదేశించారు. ఒకే పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం పోటీ పడే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని హెచ్చరించారు. జడ్పీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ పోటీ పట్ల ఆసక్తి చూపడం లేదని పేర్కొన్న సీఎం, కూటమి శ్రేణులు మాత్రం అనవసరమైన అంతర్గత పోటీలకు దిగకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల ఐక్యతే ప్రాధాన్యంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకునేలా పార్టీ నేతలు కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.




















