- 30కి పైగా ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
- రూ.31,387 కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్
- ఏవీజీసీ, రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీలకు గ్రీన్ సిగ్నల్
- ఐటీ, ఏఐ, సెమీకండక్టర్ రంగాలకు ప్రోత్సాహం
- భారీ పెట్టుబడులకు భూకేటాయింపులు.. కొత్త పరిశ్రమలకు అనుమతులు
- ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్డు భద్రతకు ప్రత్యేక డైరెక్టరేట్
- మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పార్కు.. కొత్తగా ఉపాధి అవకాశాలు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊపునిస్తూ, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, అత్యాధునిక సాంకేతిక రంగాలను ప్రోత్సహించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీ, పరిశ్రమలు, రెవెన్యూ, హోం, ఇంధన తదితర శాఖలకు సంబంధించిన 30కి పైగా అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్లు, రోబోటిక్స్, డేటా సెంటర్లు, బ్యాటరీ మెటీరియల్స్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది.
2026-31 కాలానికి ఏపీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్సఆర్) పాలసీకి, ఏపీ రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ విధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ సెమీకండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 2024-29 ముసాయిదా సవరణలకు కూడా పచ్చజెండా ఊపింది. తద్వారా డిజిటల్ వినోద రంగం నుంచి అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఏఐ డేటా సెంటర్లకు భారీ ప్రోత్సాహం
రాష్ట్రంలో ఏఐ, డేటా సెంటర్ల రంగాన్ని విస్తరించే దిశగా క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం ప్రాంతంలోని అమనాంలో ఏఎం ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో రూ.31,387 కోట్ల భారీ పెట్టుబడితో 512 మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా నిలవనుంది.
విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గిగా స్కేల్ ఏఐ డేటా సెంటర్ కోసం సుమారు 25 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.570.20 కోట్ల పెట్టుబడితో ఈపాక్ సంస్థ ఏఐ డేటా సెంటర్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతించింది. ఈ పరిశ్రమ ద్వారా 2,565 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు అదానీ గ్రూప్ ప్రతిపాదించిన క్లౌడ్ హబ్ ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించి, తదుపరి పరిశీలన కోసం ఐటీ శాఖకు పంపినట్లు సమాచారం.
బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలకు ఊతం
పారిశ్రామిక తయారీ రంగంలో పెట్టుబడులను పెంచే క్రమంలో నాయుడుపేటలో కార్బన్ కాస్మో అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సంస్థ రూ.4,000.20 కోట్లతో ఏర్పాటు చేయనున్న బ్యాటరీ మెటీరియల్ తయారీ పరిశ్రమకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో రూ.700 కోట్ల పెట్టుబడితో డిక్సన్ టెక్నాలజీస్ సంస్థకు స్థల కేటాయింపునకు అంగీకరించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటిరో గ్రూప్‌కు చెందిన ఫార్మా సంస్థలకు 173.82 ఎకరాల భూమి కేటాయింపునకు పచ్చజెండా ఊపింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.236.92 కోట్లతో రవళి స్పిన్నర్స్ చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,569 మందికి ఉపాధి లభించనుంది. అలాగే అన్నమయ్య జిల్లాలో 56.82 ఎకరాల విస్తీర్ణంలో స్కికార్ప్ ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్కు, తంబళ్లపల్లెలో సుమారు 21 ఎకరాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎసఎంఈ) పార్కు ఏర్పాటుకు అనుమతించింది.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పార్కు
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని జయంతిపురంలో 30 ఎకరాల విస్తీర్ణంలో ఎఫఎల్‌వో (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలు స్వతంత్రంగా పరిశ్రమలు స్థాపించి, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన పారిశ్రామిక వసతులను కల్పించడం ఈ పార్కు ప్రధాన ఉద్దేశం. దీనివల్ల మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక డైరెక్టరేట్
రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించింది. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని డీజీపీ ఆధ్వర్యంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ విభాగం పనిచేయనుంది. ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యల అమలు, ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందించడం ఈ డైరెక్టరేట్ బాధ్యతలుగా ఉండనున్నాయి.
ఇంధన రంగంలోనూ కీలక నిర్ణయాలు
సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు క్యాబినెట్ పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ (ఎసఎంఆర్) సాంకేతికతతో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అంగీకరించింది.
విజయవాడలో 15 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. ఇందుకోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏపీ జెన్కోకు చెందిన 5.50 ఎకరాల భూమిని ఉచితంగా బదిలీ చేయనుంది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు 192.68 ఎకరాల వక్ఫ్ భూమిని 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు అంగీకరించింది.
విద్య, దేవాదాయ శాఖల్లోనూ నిర్ణయాలు
రాజధాని పరిధిలోని శాఖమూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని లీజుకు ఇవ్వడంతో పాటు స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు రెండు ఎకరాల స్థలం కేటాయించనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన సన్నిధి యాదవ, సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటుకు, దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్ హోదాలో ముఖ్య స్థపతి పోస్టుల ఏర్పాటుకు అంగీకరించింది. మరోవైపు నాయుడుపేట సెజ్‌లో గతంలో వెబ్‌సోల్ రెన్యువబుల్స్, మెట్రో డెకరేటివ్ సంస్థలకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని నిర్ణయించింది.
పార్ట్నర్షిప్ సమ్మిట్‌పైనా చర్చ
విశాఖపట్నంలో ఈనెల 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నేపథ్యంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేయడం వంటి అంశాలపైనా క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ, ఏఐ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో తీసుకున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.




















