అమరావతి (చైతన్య రథం): స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని చూసుకొని గర్వంతో విర్రవీగొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంగళవారం క్యాబినెట్ భేటీ ముగిశాక రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయగర్వాన్ని తలకెక్కించుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతతో, 2029 ఎన్నికలు లక్ష్యంగా పని చేయాలని చెప్పారు. విజయాల తరువాత మరింత ఒద్దికగా ఉండాలని.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. మనం ప్రజలకు మేలు చేయాలని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారితో చర్చించారు. పలు కీలక విషయాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
2029 ఎన్నికలపై దృష్టి పెట్టాలని.. ఆ దిశగా అందరం పని చేయాలని సూచించారు. ఇక కూరగాయల ధరలు తగ్గాయని.. బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ధరల భారం ఉండకూడదన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రజలకు ఉపయోగపడాలని సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాత సొసైటీ ఎన్నికలు ఉంటాయని.. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మనమంతా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో రైతు బజార్లలో ధర తగ్గించి బియ్యం విక్రయిస్తున్నామని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆర్నాబ్, మురసు తుఫానుల నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు బాగా పని చేశారని ఇంధన మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. సీఎం చంద్రబాబు ఫోన్ చేయడంతో.. ఆయా రాష్ట్రాల నుంచి విద్యుత్ సిబ్బంది ఏపీకి వచ్చారని వివరించారు.




















