- ఇదే నా చివరి కోరిక..ఆదుకోండి
- అమెరికాలో క్యాన్సర్ బాధితుడి విజ్ఞప్తి
- స్పందించిన మంత్రి నారా లోకేష్
- కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని భరోసా
అమరావతి(చైతన్యరథం): ఉన్నత విద్య అభ్యసించి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అమెరికా వెళ్లిన ఓ యువకుడికి ఊహించని పరిణామం ఎదురైంది. కొన్ని నెలలకే క్యాన్సర్ అని తేలింది. ఇటీవల ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో స్వస్థలానికి వచ్చి కుటుంబీకులు, ఆత్మీయులతో గడపాలని ఉందని..ఇదే నా చివరి కోరిక అని తెలిపాడు. ఇందుకు ప్రభుత్వం సాయం చేయాలని అభ్యర్థించాడు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బాధిత కుటుంబంతో మాట్లాడినట్లు చెప్పారు. ఏపీకి చెందిన భరత్ పులిపాటి.. ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఏడాది తర్వాత ప్రాణాంతక హెపటో సెల్యులార్ కార్సినోమా (కాలేయ క్యాన్సర్) బారిన పడినట్లు తేలింది. దీంతో నాలుగేళ్ల నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆరోగ్యం విషమించడంతో టెక్సాస్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. సోదరి ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఈ దశలో మాతృభూమికి రావాలని ఉందని.. మిగతా జీవితాన్ని అక్కడే గడపాలని ఉందని చివరి కోరికను వెల్లడించారు. అయితే అనారోగ్యం దృష్ట్యా సాధా రణ కమర్షియల్ విమానంలో ప్రయాణించడం సురక్షితం కాదని, ఎయిర్ అంబులెన్స్ సాయం అవసరమని చెప్పాడు. ఈ మేరకు ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ భరత్ వీడియో విడుదల చేయగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. భరత్ సోదరితో మాట్లాడినట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నం దున ప్రయాణాలు చేయొద్దని వైద్యబృందం సూచించినట్లు తెలిసిందని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని, వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.














