- అందరి ప్రార్థనలు ఫలించాయి
- చిన్నారిని స్కూల్లో చేర్చబోతున్నాం
- తండ్రికి మెరుగైన వైద్యసాయం…
- తల్లికి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటన
- ఇంటి స్థలం ఇచ్చేందుకు అధికారుల చర్యలు
అమరావతి(చైతన్యరథం): సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన బాలుడు రామయ్య ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. ఈ విషయాన్ని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాలుడు రామయ్య దొరికిన విషయాన్ని తెలియజేయడం సంతోషంగా ఉంది..అందరి ప్రార్థనలు ఫలించాయి..చిన్నారిని సురక్షితంగా ఇంటికి చేర్చినట్లు తెలిపారు. గొర్రెల కాపరి రామయ్య అనే బాలుడి గురించి అందరూ నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎంతో ఆందోళనగా పోస్టులు పెట్టారని గుర్తు చేశారు. చిన్నారి వీడియో చూసి కలత చెందినట్లు వెల్లడిం చారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి రామయ్యను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు తెలిపారు. బాలుడిని రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చబోతున్నామని, అతని తండ్రికి మెరుగైన వైద్యసాయం అందించనున్నట్లు వివరించారు. బాలుడి తల్లికి స్వయం ఉపాధి కల్పించబోతున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆగమేఘాలపై స్పందించి బాలుడి ఆచూకీ తెలుసుకుని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రామయ్య గురించి తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికీ లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన ఇస్తేరమ్మ, ఆశీర్వాదం చెత్త కాగితా లు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరు ఇటీవల తమ ఇద్దరు బిడ్డలతో నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో పడుతున్న కష్టాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకేష్ తక్షణమే స్పందించారు. అదేవిధంగా కుటుంబంలోని పాపకు గుండె సంబంధిత సమస్యకు అవసరమైన ఆపరేషన్ చేయించేం దుకు అధికారులు వైద్యపరమైన చర్యలు చేపట్టారు.













