- తుపాను ముప్పుపై కలెక్టర్లూ అప్రమత్తం
- సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
- ఆకస్మిక వరద ముప్పున్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు అవకాశమున్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. నదుల్లో ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కదలిక, దాని ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై సీఎస్, డీజీపీతోపాటు వివిధ శాఖల అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తుపాను శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం-కవిటి మధ్య తీరం దాటే అవకాశమున్న నేపథ్యంలో.. తీరందాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికార్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. ఈ నెల 24, 25 తేదీల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంకు తెలిపారు.
రాష్ట్రంలోని 261 మండలాలకు సంబంధించి 129 మండలాల్లో భారీ వర్షాలు, 121 మండలాల్లో సాధారణ వర్షాలు, 9 మండలాల్లో అతి భారీ వర్షాలు, 2 మండలాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకల్లో ఆకస్మిక ప్రవాహాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
















