- క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై చర్చ
- నాయుడుపేటలో లిథియం-అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్‌కు శంకుస్థాపనకు ఆహ్వానం
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో నాన్ గ్రీన్మెట్ సంస్థ విస్తరణ ప్రణాళికలపై సంస్థ వ్యవస్థాపకుడు, చైర్పర్సన్ నవీన్ అగర్వాల్‌తో చర్చ జరిగినట్టు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాష్ట్రంలో కొత్త అవకాశాలు, పెట్టుబడులపై ఇరువురూ చర్చించారు. నాన్ గ్రీన్మెట్ నాయుడుపేటలో ఏర్పాటు చేయనున్న లిథియం-అయాన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని నవీన్ అగర్వాల్ తనను ఆహ్వానించినట్లు లోకేష్ వెల్లడించారు. ఏపీలో సంస్థ చేపట్టనున్న భవిష్యత్ ప్రణాళికలపై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులపట్ల పారిశ్రామిక సంస్థల్లో పెరుగుతున్న ఆసక్తి సంతోషాన్ని కలిగిస్తోందని లోకేష్ పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులతో ఉద్యోగాల కల్పనతో పాటు ఆధునిక సాంకేతిక సామర్థ్యాలు పెంపొందించాలని, రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. మరిన్ని పెట్టుబడులను ఏపీకి ఆహ్వానించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
















