కాకినాడ రూరల్ (చైతన్య రథం): కాకినాడ జిల్లా తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారతీయం’ కార్యక్రమంలో విద్యా మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. సత్సంగంలో మంత్రి నారా లోకేష్‌కు చాగంటి కోటేశ్వరరావు వేద ఆశీర్వచనం అందించారు. కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి (కంచి పరమాచార్య) రచించిన ‘దేవుని స్వరం’ పుస్తకాలను ఈ సందర్భంగా లోకేష్‌కు బహుకరించారు. అనంతరం సత్సంగం సభ్యులతో మంత్రి ముచ్చటించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
వినూత్నంగా భారతమాతకు హారతులు
కార్యక్రమంలో భారతమాతకు 108 మంత్రాలతో పుష్పాంజలి సమర్పించారు. భారతీయతను ప్రతిబింబించే శబ్దాలను, స్వరాలను మేళవించి ‘వందేమాతరం’ గీతాలాపనతో వినూత్నంగా భారతమాతకు హారతులు ఇచ్చారు.
సైనిక సేవలను విద్యార్థులతో పంచుకున్న మాజీ సైనికుడు
కార్యక్రమంలో మాజీ సైనికుడు కిరణ్ కుమార్ భారత సైన్యంలో తాను అందించిన సేవలు, తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. దేశ రక్షణ కోసం ఆయన అందించిన సేవలను అభినందిస్తూ మంత్రి లోకేష్.. కిరణ్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ మెమెంటోలు అందజేసి సత్కరించారు. భారతీయ సంస్కృతి, దేశభక్తి, సేవాభావం, సైనికుల త్యాగాలపట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా ‘భారతీయం’ కార్యక్రమం కొనసాగింది.












