పాయకరావుపేట (చైతన్యరథం): ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా పవిత్ర గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూభాగాన్ని తాకాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం (సీతారాంపురం) వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారు. తొలుత పీఎల్ పురంలో సీఎంకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కాలువ ప్రాంతానికి చేరుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ గోదారమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. రెగ్యులేటర్ ఆన్ చేసి అధికారికంగా నీటిని విడుదల చేశారు. అనంతరం పాయకరావుపేటలో సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రైతులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభా వేదిక మధ్యలో ర్యాంప్ వాక్ చేస్తూ వచ్చిన వారిని ఉత్సాహపరిచారు.















