పాయకరావుపేట (చైతన్యరథం): రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. హెలిపాడ్ వద్దకు చేరుకున్న సీఎంకు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి పోలవరం ఎడమ కాల్వ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు జరిపి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేశారు. గోదావరి జలాల రాకతో మా ప్రాంతం సస్యశ్యామలం అయ్యిందంటూ రైతులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం, అక్కడ ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రూప్ ఫొటోలు దిగారు.














