- ఎమ్మెల్యే విరూపాక్షిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఆ మహిళకు జగన్ క్షమాపణ చెప్పాలి
- నేరగాళ్లకు అండగా నిలబడటం ఆయన మానసిక స్థితికి నిదర్శనం
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపాటు
అమరావతి (చైతన్యరథం): దళిత మహిళపై రాక్షసంగా దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన సుచిత్రపై కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన విరూపాక్షి.. దళిత మహిళ ఇంటిపై దాడి చేసి వీధి రౌడీలా వీరంగం సృష్టించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. చట్టాలు చేయాల్సిన సభలో సభ్యుడిగా ఉన్న విరూపాక్షి, దళిత మహిళ దుస్తులు చించి ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఇలాంటి నేరం చేసిన వాళ్లకు జగన్ కొమ్ము కాయడం.. అతని మానసిక స్థితిపై సందేహాలు రేకెత్తిస్తోందని విమర్శించారు. దళిత మహిళ గౌరవానికి తీవ్ర స్థాయిలో భంగం కలిగించిన విరూపాక్షిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆమెకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సిగ్గు లేకుండా పరామర్శలా?
ఆలూరు నియోజకవర్గం నేమకల్లు గ్రామానికి చెందిన దళిత మాదిగ కులానికి చెందిన సుచిత్ర, ఆమె భర్త నాగరాజు తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఈ నెల 1వ తేదీన శేఖర్ యాదవ్, వైసీపీ అభిమాని గిరి మధ్య చిన్నపాటి ఘర్షణ మొదలైంది. దీంతో గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి ఫోన్ చేయగా ఆయన 200మంది రౌడీలతో వచ్చి శేఖర్ యాదవ్‌ను చితకబాదారు. ఆ తర్వాత శేఖర్ యాదవ్ స్నేహితుడైన నాగరాజు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఇంటి దగ్గర ఉన్న ఆయన భార్య సుచిత్రపై శారీరకంగా దాడి చేశారు. ఒంటిపై ఉన్న బట్టలు చించేసి రాక్షస ఆనందం పొందారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి దళిత మాదిగ కులానికి చెందిన ఆ ఇంట్లో చొరబడి… ఈ రకంగా చేస్తారా జగన్ మోహన్ రెడ్డీ? ఒక దళిత మాదిగ మహిళపై హేయమైన రీతిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. దుస్తులు చించి మానవ మృగాళ్లలా ప్రవర్తించారు. చిరిగిన తన భార్య దుస్తులు పట్టుకొని చూపిస్తూ ఏంటీ ఈ అన్యాయం అని ఆ భర్త ప్రశ్నిస్తే ఆయనే చించేశాడని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షికి సిగ్గుందా.. ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా అని వర్ల రామయ్య నిలదీశారు. మీ పార్టీ వాళ్లు ఏం చేస్తున్నారు.. ఎలా ప్రవర్తిస్తున్నారు.. ఎలా దాడులు చేస్తున్నారు.. ఏ వర్గం మీద ఇట్లా తెగబడుతున్నారు.. మీకు అర్థమవుతోందా జగన్ మోహన్ రెడ్డీ? ఆ మహిళను తాకరాని చోట్ల తాకి ఎమ్మెల్యే రాక్షస ఆనందాన్ని పొందాడు. ఇలాంటి వాళ్లు జగన్ రెడ్డిగా మంచిగా కనిపిస్తారా? ఎమ్మెల్యే విరూపాక్షిని పలకరించడానికి వెళ్తావా? ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా? ఇంతటి నీచానికి పాల్పడిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే, వెళ్లి అతడిని పరామర్శించి ఏం చెబుతావు? మంచిపని చేశారంటూ అభినందిస్తారా అని జగన్‌పై వర్ల రామయ్య విరుచుకుపడ్డారు.
జగన్ మానసిక స్థితిపై అనుమానాలు
జగన్ మానసిక పరిస్థితిపై అనేక సందేహాలు వస్తున్నాయి. అతను ప్రవర్తిస్తున్న తీరే అందుకు కారణం. జగన్ కేవలం నేరస్థులకే ఎందుకు కొమ్ము కాస్తున్నారు? బాధితులను వదిలిపెట్టి ముద్దాయిలను పలకరించడానికి జగన్ రెడ్డి వెళతారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి అతడిని గుంటూరు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలి. అక్కడ నిపుణులైన వైద్యులతో జగన్ రెడ్డి పరీక్షలు చేయించుకోవాలని వర్ల రామయ్య సూచించారు.
నేరగాళ్లంటే అమితమైన ప్రేమ
రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును తప్పించడానికి అమాయకుడైన మరో యువకుడిని నిందితుడిగా చూపించి కేసును తారుమారు చేసి అరెస్టయిన సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి జగన్‌రెడ్డి తాడేపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తీరా వెళ్లి అక్కడ కలిశాడా? కేవలం బల ప్రదర్శన చేయడానికే వెళ్లాడు. స్వయంగా డాక్టరైన సీదిరి ప్రమాందంలో తీవ్రంగా గాయపడ్డ గొర్రెలు కాసుకునే దానయ్యకు వెంటనే వైద్యం అందించి బతికించే ప్రయత్నమే చేయలేదు. తన కొడుకును కేసు నుంచి ఎలా తప్పించాలనే చూసుకున్నాడు. అలాంటి నేరస్థులను పరామర్శించేందుకు వెళ్లి వారికి మద్దతుగా మాట్లాడటం జగన్ మానసిక స్థితిని తెలియజేస్తోంది. అలానే గతంలో తెనాలిలో గంజాయి తాగుతూ, మద్యం సేవిస్తూ దారిన వచ్చీపోయే మహిళలను ఇబ్బంది పెడుతున్న ముగ్గురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేస్తే.. వారిని పలకరించడానికి వెళ్లి అక్కడ హంగామా చేయడం జగన్ ప్రస్తుత మానసిక స్థితి బాగాలేదనే విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. సొంత భార్యలే ఛీ కొట్టిన వాళ్లను జగన్ దగ్గరకు చేర్చుకుని వాళ్లకు భరోసా కల్పిస్తాడు. నేరగాళ్లపట్ల జగన్ రెడ్డికి ఎందుకు అంత ప్రేమ అనేది ఎవరికీ అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలందరూ సునిశితంగా గమనించాలని వర్ల రామయ్య కోరారు.















