బనగానపల్లె (చైతన్యరథం): అభివృద్ధిపై చర్చకు రావాలని తాను అంటుంటే వైసీపీ నేతలు మాత్రం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలంటూ తప్పుడు సవాళ్లు విసురుతున్నారని రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పొట్టిపాడు గ్రామంలో సోమవారం జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టిపాడు గ్రామంలో దాదాపు 575 మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ప్రజల భూములతో చెలగాటమాడి రెవెన్యూ సమస్యలు సృష్టించారు. రెవెన్యూ శాఖలో జరిగిన పొరపాట్లను నేడు సరిదిద్దుతున్నాం. పొట్టిపాడు గ్రామంలో 2014 – 19 మధ్య రూ.50 లక్షలతో సీసీ రహదారులు నిర్మించాం. నేడు రూ. 35 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నాం. ఒక్క తల్లికి వందనం పథకం ద్వారానే గ్రామంలో దాదాపు రూ.66 లక్షలు అందిస్తున్నాం. స్థానికంగా గ్రామంలో రూ. 2 కోట్లతో బ్రిడ్జి నిర్మించాం.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తీరుపై మంత్రి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటే.. మళ్లీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నాడని విమర్శించారు. మీ ఇష్టం వచ్చినట్లు రాజీనామా చేసి పోటీ చేయడానికి ఇది ప్రజాస్వామ్యమా..రాచరికమా? గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి మర్చిపోయి మళ్లీ పోటీ చేయాలంటూ సవాల్ విసురుతున్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి చేశారో ఏ గ్రామంలోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఎస్పీ దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. ఎస్పీ దగ్గర పర్మిషన్ ఎందుకు.. కత్తుల తిప్పడానికి తీసుకోవాలా? 2029లో చూసుకుందాం ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు గెలుస్తారు. వైసీపీ నేతల తరహాలో ఆంబోతుల్లా మా పార్టీ నేతలు గ్రామాల్లో తిరగడం లేదు. రప్పా.. రప్పా.. ఆడిస్తాం.., కోబలి వంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తేనే 151 సీట్ల నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మా పార్టీ నేతలపై ఎన్నో కేసులు పెట్టి అరాచకాలు సృష్టించారు. మేము శాంతి కోరుకుంటుంటే, ప్రతిపక్ష నేతలు ఘర్షణ పూరిత వాతావరణం కోరుకుంటున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
కోవెలకుంట్లలో స్థానికంగా పరిశ్రమలు పెట్టుకునేందుకు వీలుగా రూ.24 లక్షలతో త్రీ పేజ్ విద్యుత్ అందిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం నిధులు అందిస్తున్నాం. మంత్రి లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. సన్న బియ్యంతో మధ్యాహ్నం భోజనం అందించడం సాధారణ విషయం కాదు. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తాను. పనిచేసే నాయకులకు ప్రజలు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ అందరి ఆశీస్సులతో మంత్రి పదవి వచ్చింది. దానిని నిలబెట్టుకుంటూ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాను. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు చేస్తున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
















