- అర్బన్ గవర్నెన్స్‌లో సహకారం అందించండి
- ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలి
- సెమీకండక్టర్లు, క్వాంటమ్, యూనివర్సిటీ
- పరిశోధనలకు తోడ్పాటు అందించేలా విజ్ఞప్తి
- అమరావతి నిర్మాణంపై అడిగిన లారెన్స్‌వాంగ్
- ఏపీ-సింగపూర్ మధ్య ఎయిర్ కనెక్టివిటీపై
- విదేశీ వ్యవహారాల మంత్రితో సీఎం చర్చ
సింగపూర్: రెండు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రధాని అధి కారిక నివాసంలో 30 నిముషాల పాటు ఇరువురూ వివిధ అంశా లపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యంతో పండిం చిన ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అంశాలను పరిశీలించాలని చంద్రబాబు కోరారు. సింగపూర్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా యూనివర్సిటీల్లో పరిశోధనలకు సంబంధించి సహకారం అందించాలని కోరారు. సెమీ కండక్టర్ల తయారీ ఎకోసిస్టమ్, కెపాసిటి బిల్డింగ్‌లో తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ నగర, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ గవర్నెన్స్‌లోనూ సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యం ద్వారా పంటలు పండిస్తున్నట్టు వివరించారు. ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రత్యేకంగా కోరారు.
ప్రకృతి సేద్యం ద్వారా సాగైన ఉత్పత్తులకు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సాధిం చేలా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. పోర్టులు-ఎయిర్ పోర్టుల అభివృద్ధితో పాటు వివిధ అవకాశాలను అందిపుచ్చుకు నేలా ఏపీ-సింగపూర్‌లు కలిసి పనిచేయాలని కోరారు. ఇరువురు నేతల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణాల గురించి సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ముఖ్యమం త్రిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో విద్యాసంస్థ లు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడు తున్న నిర్మాణాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రాజధాని నిర్మాణాల గురించి సీఎం చంద్రబాబు వివరించారు. అమరావతి అత్యంత నివాసయోగ్యమైన నగరాల సరసన చేరనుం దని తెలిపారు. ఏపీలో ప్రజారోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి వివరించారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా ఏపీ ముందుకు వెళుతుందని తెలిపారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గుదల అంశంపై ఇరువురు చర్చించుకున్నారు. అందు బాటులో గృహ నిర్మాణం, శిశువులు, చిన్నారుల సంరక్షణ చర్యల పైనా చర్చ జరిగింది. సేవల రంగం తరహాలోనే తయారీ, సప్లై చైన్ రంగాలు కూడా భారత్‌లో విస్తృతం అవుతాయని ఇరువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ
సింగపూర్ ప్రధానితో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వీవీఎన్ బాలకృష్ణన్‌తో సమావేశ మయ్యారు. ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ మధ్య వ్యూహాత్మక భాగస్వా మ్యాలపై మధ్య చర్చ జరిగింది. ఏపీ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు, వివిధ విమానాశ్రయాలకు ఎయిర్ కనెక్టివిటీపై చర్చిం చారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన అంశా లను సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రికి సీఎం వివరించారు. తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ ఏపీ అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తోందని తెలియచేశారు. పరిశ్రమల ఏర్పాటుకు భూమి లభ్యతతో పాటు సేవల రంగంలో నిపుణులైన మానవ వనరులు ఏపీలో ఉన్నాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ఏపీ కీలకంగా ఉందని స్పష్టం చేశారు.
ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతంతో పాటు, సరుకు రవాణాకు పోర్టులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌తో పాటు ఇంటర్నెట్ సహా డేటా సేవల కోసం సబ్ సీ కేబుల్‌ను ఏపీ నుంచి ప్రపంచానికి కనెక్ట్ చేస్తున్నారని తెలిపారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని..ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రపంచ దిగ్గజ స్టీల్ తయారీ సంస్థ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సింగపూర్‌లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే తదితరులు పాల్గొన్నారు.













