- పరిహారం, పునరావాస చర్యలకు కేటాయింపు
- ప్రాజెక్టు సాకారానికి మరో ముందడుగు
- త్వరలో నిర్వాసితులకు అందజేసే అవకాశం
ఒంగోలు(చైతన్యరథం): వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు హామీలు తప్ప ఆర్థికపరంగా బడ్జెట్లో కేటాయింపులు లేక ఆందోళన చెందు తున్న నిర్వాసితులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం, పునరావాస చర్యలకు సంబంధించి ప్రస్తుత ఏడాది బడ్జెట్లో మరో రూ.906 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసితులకు త్వరలో ఆ నిధులు అంద నున్నాయి. ఈ ఏడాది నీరు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. దీంతో పునరావాసంపైనా దృష్టి సారించింది. గతంలో గుర్తించిన 7,321 నిర్వాసిత కుటుంబాల్లో ప్యాకేజీ పొందిన 96 కుటుంబాలు పోను మిగతా 7,225 కుటుంబాల వారికి ప్యాకేజీ, అలాగే పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన, అందుకు అవసరమైన భూసేకరణ కోసం సుమారు రూ.1,025 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుత ఏడాది (2026-27) బడ్జెట్లో వెలిగొండకు కేటాయించిన రూ.532 కోట్లలో పునరావాస చర్యల కింద కేవలం రూ.80 కోట్లు మాత్రమే చూపారు. మిగిలిన నిధులు జరుగుతున్న పనులకే సరిపోయే అవకాశం లేదు. ఈనేపథ్యంలో రానున్న ఆగస్టులో రిజర్వాయర్‌కు నీరు ఇచ్చేందుకు నిర్వాసితుల పునరావాసం అత్యవసర మని మంత్రి నిమ్మల రామానాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గత నెలలో నిర్వహించిన సమీక్షలో నిర్వాసితులకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్ కేటాయింపులలో చేర్చాలని ఉన్నతస్థాయి అధికారులను సీఎం ఆదేశించారు. తదనుగుణంగా ఈ ఏడాది బడ్జెట్లోనే పునరావాస చెల్లింపుల కోసం మరో సుమారు రూ.906 కోట్లు కేటాయిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు తాజాగా విడు దలయ్యాయి. త్వరలో వాటిని నిర్వాసితులకు అందజేయనున్నారు.















