- విద్యుత్ అంతరాయాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిందే
- 1912 కాల్ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయాలి
- విధి నిర్వహణలో ఉన్నతాధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
- విద్యుత్ శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పని చేయాలి
- ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి గొట్టిపాటి
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మూడు డిస్కంల సీఎండీలు, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 132, 220, 400 కేవీ సబ్ స్టేషన్ల పనుల్లో జరుగుతున్న జాప్యాలపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యాలకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయాలపై కూడా మంత్రి అధికారులను ప్రశ్నించారు. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు మూడు డిస్కంల పరిధిలోని 1912 కాల్ సెంటర్లను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయాలని ఆదేశించారు. కాల్ సెంటర్లలో అవసరమైన లైన్లు, సిబ్బందిని ఏర్పాటు చేసి వినియోగదారులకు జవాబుదారీగా సేవలు అందించాలని సూచించారు. కాల్ సెంటర్ల పనితీరుపై సీఎండీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. మరమ్మతులు లేదా ఇతర కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే పరిస్థితుల్లో ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. ముఖ్యంగా ఈదురుగాలులు, వర్షాల కారణంగా చెట్లు లేదా హోర్డింగులు విద్యుత్ లైన్ల పై పడిన సందర్భాల్లో పునరుద్ధరణకు పట్టే సమయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఉన్నతాధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యుత్ శాఖ ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండేలా పని చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆసుపత్రులు, ఇతర అత్యవసర సేవలందించే విభాగాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మూడు డిస్కంల సీఎండీలకు ఆదేశించారు.















