- మహిళల్ని మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటు
- మహిళల ఓట్లు అడిగే పార్టీలు రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడమేంటి?
- 33శాతం రిజర్వేషన్లు అమలయ్యే దాకా పోరాడతాం
- రాష్ట్రంలో గొడ్డలి పార్టీకి తెలిసింది కూల్చడం, నరకడమే
- ఇక్కడున్నది 1995 సీఎం… గొడ్డలి పార్టీ ఆగడాలు సాగనివ్వను
- జూన్ నాటికి పట్టణాల్లో 100శాతం చెత్త క్లియర్
- స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
- నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి నివేదికను ప్రజల ముందుంచిన సీఎం
నిడదవోలు (చైతన్య రథం): కాంగ్రెస్ నేతృత్వంలోని మిత్రపక్షాలు సహకరిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేదని, కానీ ప్రతిసారీ మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఎన్నటికీ మనుగడ సాగించలేవని, మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం బిల్లుపెడితే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకున్నాయి. రిజర్వేషన్లు సాధించే వరకూ ఆడబిడ్డలకు అండగా ఉంటాం. కాంగ్రెస్ సహా దాని మిత్రపక్షాలు మహిళ బిల్లును ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు… నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నాను.
ఆనాడు బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ సపోర్టు చేసేందుకు ఒప్పుకోకపోవడంతో విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధానిగా వాజ్‌పేయి హయాంలో నాలుగుసార్లు బిల్లు తెచ్చారు. ప్రతిసారీ బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. 2010లో యూపీఏ అధికారంలో ఉండగా మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదించారు. దాన్ని బీజేపీ కూడా సమర్థించింది. కానీ లోక్‌సభకు బిల్లు తీసుకురాకుండా మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది. ప్రధాని మోదీ 2023లో మహిళ రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే అందరూ సహకరించారు. దేశంలోని మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని ప్రధాని మోదీ పట్టుదలతో బిల్లు తీసుకొస్తే మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకూ సమంజసం? చిన్న రాష్ట్రాలు, దక్షణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్‌వల్ల అన్యాయం జరుగుతుందంటున్నారు.
ఆ లాజిక్ ఏంటో నాకు అర్ధం కావడంలేదు. ప్రస్తుతం ఉన్న సీట్లకంటే 50శాతం పెరుగుతాయని పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వాజ్‌పేయి హయాంలో 1971 లెక్కల ప్రకారం ముందుకెళ్లారు. మహిళలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. 1996నుంచి 2026 వరకూ 30 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉన్నారు. మహిళా బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో ఆ దేవునికే తెలియాలి. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా మేము 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళలకు చేసిన మోసంపై ప్రజా చైతన్యం తీసుకొస్తాం. మహిళలను చట్టసభల్లో చూడాలన్నది నా ఆకాంక్ష. కాంగ్రెస్‌నుంచి వచ్చిన తోక పార్టీ రాష్ట్రంలో ఉంది. వారికి మహిళల సమస్యలు పట్టవు. మహిళలను గౌరవించినప్పుడే సమాజం ముందుకు వెళుతుంది” అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మహిళల సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించాం
“మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇంటిని సమర్థవంతగా నిర్వహించడంలో మహిళలు ముందున్నారు. దేశంలోనే మొదటిసారిగా మహిళలకు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఆస్తిలో సమానహక్కు ఇచ్చారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేను మహిళల ఆర్థిక ప్రగతి కోసం డ్వాక్రా సంఘాలు స్థాపించాను. నేడు డ్వాక్రా మహిళలు రూ. 50 వేల కోట్ల రుణాలు తీసుకుంటున్నారు. రూ. 25 వేల కోట్ల కార్పస్ ఫండ్ పొదుపు సంఘాల దగ్గరుంది. మహిళలకు ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేశాను. దీంతో వరకట్న సమస్యను పూర్తిగా రూపుమాపాం. ఐటీలో భర్తకంటే భార్యే ఎక్కువగా సంపాదిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ప్రతి నెలా ఒకటో తేదీన 63 లక్షలమందికి పింఛన్లు ఇస్తున్నాం. ఇందుకోసం రూ. 33 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నాం. స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఉద్యోగస్తులు కూడా బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఎక్కడికైనా వెళుతున్నారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
గొడ్డలి పార్టీతో ప్రజలకు ప్రయోజనం శూన్యం
“సుపరిపాలనే కూటమి లక్ష్యం. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వం పోలవరం డయాఫ్రంవాల్‌ను గోదావరిలో కలిపేసింది. కేంద్ర సహకారంతో గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించింది. గతంలో రాజధానికి రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. తాజాగా 10 గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటుంది. పేదలకు కడుపునిండా తిండి పెట్టడానికి వారికి మనసు రాదు. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే లక్ష్యంతో మనం తెచ్చిన అన్న క్యాంటీన్లను కక్షతో మూసేశారు. ప్రజా ప్రభుత్వంలో 269 అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయి. పేదలకు కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే… లేకపోయినా ఒకటే. గొడ్డలి పార్టీవల్ల ప్రజలకు ఉపయోగం లేదు. గొడ్డలిపార్టీకి తెలిసిందల్లా విధ్వంసం, కూల్చడం, నరకడమే. రాష్ట్రంలో సీబీఎన్, పవన్ కల్యాణ్… కేంద్రంలో నరేంద్ర మోదీ ఉన్నారని వారు గుర్తుంచుకోవాలి. ఎవర్నీ వదిలిపెట్టం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
జూన్‌నాటికి పట్టణాల్లో 100శాతం చెత్త క్లియర్
“రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తోంది. నేను 4వ సారి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నాను. స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని 15 నెలలుగా నిర్వహిస్తున్నాం. ప్రతి నెలా 3వ శనివారం ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతున్నాను. ఈసారి జలధార-జలహారతి ధీమ్‌తో ముందుకొచ్చాం. గత పాలకులు రాష్ట్రాన్ని చెత్తకుప్పగా మార్చేశారు. భూమిపైనే కాదు భూమి లోపల కూడా చెత్త వేశారు. ఎక్కడ చూసిన చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఒక పద్దతి ప్రకారం పని చేస్తున్నాం. ప్రజల్లోనూ చైతన్యం రావాలి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన ఆఫీసు, మన స్కూళ్లు, కాలేజీలు, పబ్లిక్ ప్లేస్‌లు, బీచ్‌లు, ఆలయాలు, పార్కులు పరిశుభ్రంగా ఉండాలి. జపాన్‌లో రోడ్లపై ఒక్క చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదు. ఆ స్పూర్తి మనలోనూ రావాలి. ప్రతీ రోజూ పట్టణాల్లో 7,527 టన్నులు, గ్రామీణ ప్రాంతాల్లో 1,430 టన్నులు… మొత్తంగా 8,957 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల్లో 153 లక్షల టన్నుల చెత్తకుగాను, 114 లక్షల టన్నుల చెత్త తొలగించాం. ఈ జూన్ నాటికి 100 శాతం క్లియర్ చేస్తాం. ప్రభుత్వ చర్యలతో పట్టణాల్లో ఇంటింటికీ చెత్త సేకరణ 86శాతం నుంచి 97 శాతానికి పెరిగింది. త్వరలోనే 100 శాతం సాధించేలా ఎలక్ట్రిక్ వాహనాలు తెస్తున్నాం.
రాష్ట్రంలో చెత్త ప్రాసెసింగ్ 57 శాతంనుంచి 100 శాతానికి పెంచుతాం. రూ.603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్టోబర్ నాటికి ఇవన్నీ పని చేస్తాయి. స్వచ్ఛ రథాలు, గ్రీన్ షాప్స్ ద్వారా చెత్తను ఆదాయంగా మారుస్తున్నాం. రాష్ట్రంలోని 633 స్వచ్ఛ రథాలతో రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 12,371 గ్రామాలు Oణఖీం కి చేరుకోగా, సెప్టెంబర్‌కి అన్ని గ్రామాలను Oణఖీం గా చేస్తాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండాలి. ప్రతి ఒక్కరూ వంటింటి వ్యర్థ్యాలను కిచెన్ గార్డెన్ కు ఉపయోగించుకోవాలి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయాలి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి… 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, 1 లక్ష సోక్ పిట్స్, 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కి.మీ. మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. 13 నగరాలకు 71 స్వీపింగ్ యంత్రాలు సమకూర్చాం. మరో 14 యంత్రాలకు టెండర్లు పిలిచాం. 2028 నాటికి ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 31.33 శాతంగా ఉన్న గ్రీన్ కవర్‌ను… 2030 నాటికి 37 శాతానికి, 2047 కల్లా 50 శాతానికి పెంచే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీలు
నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరుకు సంబంధించిన నివేదికలను వివరించారు. పనితీరు సరిగాలేని అధికారులను వివరణ అడిగారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. అధికారులకు సహకరిస్తామని, వారంతా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమలు తక్కువగా వస్తున్నాయని, ఇక్కడ వ్యవసాయంపైన ఆధారపడే వారు ఎక్కువగా ఉండటమే అందుకు కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ప్రాంతంలో ఆక్వా కల్చర్‌వల్ల రైతులకు కొంత వెసులుబాటు వచ్చింది. ఆక్వావల్ల పొల్యూషన్ లేకుండా చర్యలు తీసుకుంటాం. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందిస్తాం. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత.
స్థానికంగా చిన్న కాశిరేవు వంతెన పునర్మిర్మాణం చేపడతాం. ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తాం. ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తాం. ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి చేస్తాం. కంసాలిపాలెంనుంచి మాధవవరం వరకు వంతెన నిర్మాణం, ఎర్ర కాలువ గండ్లు పూడ్చివేతతోపాటు రహదారుల నిర్మాణం, టిడ్కో ఇళ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి సహా పలువురు ఉన్నతాధికారులు, నేతలు పాల్గొన్నారు.














