- బాధిత కుటుంబాలకు సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి
- మర్కాపురం ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్బ్రాంతి
- ప్రధాని మోదీ సంతాపం: రూ.2 లక్షల పరిహారం ప్రకటన
- రాష్ట్ర క్యాబినెట్‌లో చర్చ.. లోకేష్, మంత్రులు తీవ్ర సంతాపం
అమరావతి (చైతన్య రథం): మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న వారికి రూ.2 లక్షల చొప్పున సాయం అందించాలని సూచించారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ క్యాబినెట్లో చర్చ జరిగింది. మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి రూ.2లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణతోపాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ, పోలీసు, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రణాళికలు అమలు చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. రాయవరం ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతి
తొలుత ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్‌నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాని మోదీ సంతాపం.. పరిహారం ప్రకటన
మార్కాపురం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని మోదీ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
తీవ్ర బాధాకరం: లోకేష్
మార్కాపురం జిల్లా రాయవరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా”నని పేర్కొన్నారు.












