- అంబులెన్సుల ద్వారా శనివారం స్వస్థలాలకు తరలింపు
- వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
మార్కాపురం (చైతన్య రథం): మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమై గుర్తుపట్టలేని విధంగావున్న 14మంది మృతదేహాలను తోబుట్టవుల డీఎన్ఏలతో గుర్తించారు. ఈమేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం రాత్రి ఓ ప్రకటన జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మంత్రి సమీక్ష జరిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులో టిప్పర్ను ట్రావెల్స్ బస్సు గురువారం వేకువజామున ఢీకొట్టిన ఘటనలో 14మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్ లోని మార్చురీకి తరలించారు. వీటికి పోస్టుమార్టం నిర్వహించినప్పటికీ మృతదేహాలు ఎవరివో గుర్తించలేని విధంగా ఉండడంతో గురువారం రాత్రి తోబుట్టువుల (మొత్తం 22 మంది) నుంచి గుంటూరు రీజినల్ పోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఆర్ఎస్ఎస్ఎల్) నిపుణులు రక్త నమూనాలు సేకరించారు.
గుంటూరునుంచి వచ్చిన వారికి ఒంగోలు జీజీహెచ్ లోని ఫోరెన్సిక్ డిపార్టుమెంటు సహకరించారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. తోబుట్టువులనుంచి సేకరించిన నమూనాలను గుంటూరులోని ల్యాబ్లో పరీక్షించారు. సమష్టి కృషివల్ల ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. వీటి ఆధారంగా మృతదేహాల గుర్తింపు కార్డులోని వివరాలతో అనుసంధానం చేస్తున్నారు. శనివారం ఉదయంనుంచి తోబుట్టవులకు మృతదేహాలను అప్పగిస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసే అంబులెన్సుల ద్వారా స్వస్థలాలకు మృతదేహాలను ఎస్కార్ట్ సాయంతో పంపనున్నారు. కందుకూరు. కనిగిరి, ఒంగోలు, నెల్లూరు జిల్లా బుచ్చివరకు మృతదేహాల తరలింపు జరగనుంది.
తగిన జాగ్రత్తలతో..
డీఎన్ఏ పరీక్షల నిర్వహణలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చనిపోయిన వారి తోబుట్టవుల (రక్త సంబంధీకులు) నుంచి నమూనాలు సేకరించారు ఒక కేసు విషయంలో తండ్రి, బిడ్డ చనిపోయ్యారు. తండ్రిని ఆయన తల్లిదండ్రుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, బిడ్డను తల్లి నుంచి సేకరించిన నమూనాను పరీక్షించడం ద్వారా మృతదేహాల గుర్తింపు సాధ్యమైంది.
ఇద్దరికి శస్త్ర చికిత్స
బస్సు ప్రమాదంలో గాయపడిన 20మంది ఒంగోలు, మార్కాపురం అసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో 16మంది, మార్కాపురం జీజీహెచ్లో 12మంది, ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు చొప్పున చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి వివరించారు. ఒంగోలు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి కాళ్లకు శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పద్మావతి, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్లు, మార్కాపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ వెల్లడించారు. వైద్యుల సూచనలు అనుసరించి కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.












