- ప్రభుత్వ భవనాలపై విస్తృతస్థాయిలో సౌర విద్యుదుత్పత్తి
- ఫెర్రో అల్లాయ్స్ ్స్కు మరో ఏడాది ప్రోత్సాహకాలు పొడిగింపు
- ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు
- రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
- ఎనర్జీ రంగంలో ఒప్పందాలు 60 రోజుల్లో కార్యారూపం దాల్చాలి
- పీపీఏల రద్దుతో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపిన గత పాలకులు
- విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణతో భారాన్ని జీరో చేశాం
- విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుంది. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం కుసుమ్, ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ పథకం, విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యయం తగ్గింపు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను 2029నాటికి 9.20 శాతం నుంచి గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్ కొనుగోలు భారం తగ్గించుకునేందుకు ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు.
పీఎం కుసుమ్ సహా ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్తా బిజిలీ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టు కింద 4,792 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు 483కు పైగా ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకలను ఏర్పాటు చేసి 150 మెగావాట్లమేర విద్యుదుత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా విద్యుత్ పొదుపు చేసేలా ఉపకరణాలు వినియోగించేందుకు అవగాహనా కార్యక్రమాల్ని చేపట్టాలని సీఎం సూచించారు.
ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు 60 రోజుల్లో కార్యాచరణ
రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలు ఐస్ (ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ) పాలసీ ద్వారా 60 రోజుల్లోనే తమ కార్యాచరణ ప్రారంభించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించి అనుమతులు జార్జ్ చేయాలని స్పష్టం చేశారు. తద్వారా విద్యుదుత్పత్తిలో-ఏపీ ఓ న్యూ ఎనర్జీ హబ్ మారాలని స్పష్టం చేశారు. ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. అలాగే విద్యుత్ సంస్థలు రుణ సమీకరణలో వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. విద్యుత్ కొనుగోలులోనూ వ్యయం తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో యూనిట్కు 20 పైసలచొప్పున కొనుగోలు వ్యయం తగ్గించినట్టు సీఎస్ కె విజయానంద్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈపీఎంఎస్ విధానంతో నిరంతర పర్యవేక్షణ ద్వారా రూ.400 నుంచి రూ.500 కోట్ల మేర పొదుపు చేయగలిగామని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ ఒప్పందాల ద్వారా కొనుగోలు వ్యయం తగ్గుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలకు, వాణిజ్యం, గృహ అవసరాలు, వ్యవసాయ రంగానికి జరుగుతున్న విద్యుత్ వినియో గాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించాలని.. డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పీఎం కుసుమ్ కింద దేవాదాయ, జలవనరుల శాఖలకు చెందిన భూముల్లో విద్యుదుత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించా లన్నారు. వినియోగదారులే విద్యుదుత్పత్తి చేయటం ద్వారా తాము వినియోగించుకున్న అనంతరం మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించడం ద్వారా ఆదాయం ఆర్జించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే సోలార్ రూఫ్ టాప్ పథకం కింద సౌర ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. బీసీ వినియోగదారుకు 3 కిలోవాట్ల వరకూ రూ.20 వేల సబ్సిడీ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చేనేతలకు ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ను కూడా అమలు చేయాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మూలధన రాయితీ, జీఎస్టీ మినహాయింపు సహా 9 అంశాలకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
వెయ్యి ఈవీ బస్సుల కొనుగోలు
రాష్ట్రంలోని రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను జెన్కో ఇరిగేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల వద్ద పీఎస్పీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున విద్యుదుత్పత్తి సాధ్యమవుతుందన్నారు. ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మార్చాలని సీఎం సూచించారు. త్వరలోనే వెయ్యి ఈవీ బస్సుల్ని కొనుగోలు చేయాలన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు నాన్ టారిఫ్ ఆదాయంపై దృష్టి పెట్టాలని సీఎం సూచనలు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలోని బూడిదను వివిధ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించాలన్నారు.
గత పాలకుల నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థ విధ్వంసం
గత పాలకులు విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేశారని ముఖ్యమంత్రి సమీక్షలో ప్రస్తావించారు. పీపీఏల రద్దు నిర్ణయంతో రూ. 9వేల కోట్లమేర భారం ప్రజలపై పడిందన్నారు. విద్యుత్ను వినియోగించు కోకుండానే ఆయా విద్యుత్ కంపెనీలకు రూ.9 వేల కోట్ల ప్రజాధనాన్ని చెల్లించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణ ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ఆ భారాన్ని జీరో చేయగలిగామని సీఎం వివరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయటంతోపాటు దానికి రేటింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుదుత్పత్తికి లోటులేకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు చేయాలని సూచించారు. విద్యుత్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ప్రతీ ఏటా హ్యాకథాన్ నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారు. సమీక్షకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె. విజయానంద్, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ సీఎండీలు హాజరయ్యారు.












