- ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
- హిందూపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
హిందూపురం (చైతన్యరథం): కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని హిందూపురం ఎమ్మెల్యే అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలో పలు అభివృద్ధి పనులకు -శంకుస్థాపన చేసిన సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తనను మూడుసార్లు గెలిపించిన ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీయువకులను ఆదుకుంటానని ఇభరోసా కల్పించారు. ఏపీ మంత్రులంతా హిందూపురం అభివృద్ధిపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. కాగా, హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండోరోజు ఆదివారం కూడా పర్యటించారు. హిందూపురం మండలం మలుగూరులో రూ.26.5 లక్షల వ్యయంతో నిర్మించిన పశు వుల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. అలాగే, వాల్మీకి దేవాలయాన్ని ఆసందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు బాలకృష్ణకి ఘనంగా స్వాగతం పలికి.. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బాలకృష్ణ వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అలాగే, హిందూపురం మున్సిపాలిటీలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి బాలాజీ సర్కిల్లో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం కనకదాసు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముద్దిరెడ్డిపల్లిలో చౌడేశ్వరి కల్యాణ మండపంలో హ్యాండ్ లూమ్స్, టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో సబ్సిడీ కింద మంజూరైన చేనేత పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.














