- ఐదేళ్లు అరాచకాలకు పాల్పడి ఇప్పుడు నీతులు చెబుతున్నారు
- త్వరలోనే వైసీపీ ఖాళీ అవటం ఖాయం
- నిరాశ, నిస్పృహతో దిక్కుతోచక తప్పుడు ప్రచారం
- బియ్యం దొంగతో ప్రభుత్వంపై బురద జల్లిస్తున్నారు
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ద్వజం
అమరావతి (చైతన్యరథం): అధికారం కోల్పోయిన వైసీపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో తప్పుడు ఆరోపణలు, విషప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. అరాచకాలు, విధ్వంసాలు, కక్ష సాధింపులతో ప్రజలను పీడిరచుకుతిన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేయించి, టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారు. దీనివల్ల అనేక మంది గ్రామాలు వదిలి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. గతంలో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, నన్ను, మా నాయకుడు చంద్రబాబునాయుడుని కూడా కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదా? పచ్చని పల్లెల్లో నెత్తుటేరులు పారించిన పాపం వైసీపీదే. జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో గ్రామాల్లో కత్తులు తిప్పి అరాచకాలు చేసింది వైసీపీ నాయకులే. నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు సర్పంచ్‌గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడి, గ్రామాల్లో వ్యక్తిగత దాడులకు దిగి అక్రమ కేసులు పెట్టించాడు.
బాబూరావు అనే వ్యక్తిపై దాడి చేస్తే దాదాపు నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. గతంలో వైసీపీ నేతల దౌర్జన్యాలకు భయపడి ఊరు వదిలి వెళ్లిపోయిన వారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వస్తున్నారు. వారిని వైసీపీ నేతలు రెచ్చగొడుతూ వ్యక్తిగత కక్షలకు పార్టీ రంగులు పులుముతున్నారు. విజయవాడలో టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీ కన్ను పొగొట్టింది వైసీపీ ప్రభుత్వమే. దళిత సీఐ ఆనందరావును బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడంతో ఆయన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి చెప్పిన పనులు చేయలేదని వేధిస్తే గుర్రయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే బీసీ బాలుడు అమర్‌నాథ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టింది వైసీపీ నాయకులే. నందం సుబ్బయ్య, తోట చంద్రయ్య వంటి దాదాపు 80 మంది తెలుగుదేశం నాయకులను పెట్టన పెట్టుకుంది వైసీపీ దుర్మార్గ ప్రభుత్వమే అని మంత్రి రవీంద్ర విమర్శించారు.
జగన్ హయాంలో దళితులపై దమనకాండ
జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఒక దళిత బిడ్డపై అత్యాచారం జరిగినా పట్టించుకోలేదు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని తీసుకొచ్చి ఊరేగించారు, పోలీస్ స్టేషన్లలో కేకులు కట్ చేయించారు. కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ను హింసించి, వేధించి ఆయన ప్రాణాలు పోయేలా చేశారు. ఇసుక దందాను ప్రశ్నించిన దళిత యువకుడిపై దాడులు చేసి శిరోముండనం చేసింది కూడా వైసీపీ నేతలే. మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిపింది వైసీపీ నేతలే. పులివెందులలో దళిత మహిలపై అత్యాచారం చేసి హత్య చేస్తే, పరామర్శకు టీడీపీ మహిళా నాయకురాలు అనిత వెళితే ఆమెపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా అని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు.
కక్ష రాజకీయాలు జగన్‌కే చెల్లు
కక్షపూరితమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన వారికి పదవుల ఇచ్చి నేరస్థులను ప్రోత్సహించింది జగన్ కాదా. చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌కు మంత్రి పదవితో ప్రమోషన్ ఇచ్చారు. బూతులు మాట్లాడిన వారికి రక్షణ కల్పించారు. పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ జీవో తెచ్చింది కూడా వైసీపీనే. వైసీపీ ప్రభుత్వం హయాంలో అధికారులను వేధించి తప్పుడు పనులు చేయించారు. ఆ పాపాలకు అనేకమంది ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ మరిచిపోయి నేడు రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కరపత్రాల్లాంటి పత్రికల్లో అసత్య కథనాలు వండి వారుస్తున్నారు. వైసీపీ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి ప్రజాస్వామ్యం గురించి, కక్షసాధింపుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. దోపిడీ దొంగలు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతుంటే బాధగా అనిపిస్తోంది. పేదల బియ్యం కొట్టేసినవాడు, దొంగపట్టాలు ఇచ్చినవాడు (పేర్ని నాని)థ కూడా మాట్లాడటం హాస్యాస్పదం. గతంలో పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్‌లో చనిపోతే, దానిని అడ్డం పెట్టుకుని మతాల మధ్య విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. వైసీపీ పిల్ల సైకోలు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రెస్ మీట్లు పెట్టి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడుతూ, అధికారులను వ్యక్తిగత స్వార్థానికి వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ముంబై నటి కాదంబరి జత్వానీ విషయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో ఆమె స్వయంగా చెప్పిన విషయాన్ని మంత్రి రవీంద్ర గుర్తుచేశారు.
ప్రజల ఆకాంక్షల మేరకు ఏడాది పాలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులు, వితంతువులకు రూ.4000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వికలాంగులకు రూ.6000, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు రూ.10,000, పూర్తిగా మంచానికే పరిమితమైనవారికి రూ. 15000 పింఛన్ ఇస్తున్నాం. దాదాపు 2 కోట్ల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పథకం అమలు చేశాం. గతంలో జగన్ రెడ్డి అమ్మ ఒడి 42 లక్షల మందికి ఇస్తే, ఈ రోజు 67 లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చాం. రోడ్లపై గుంతలను పూడ్చి ప్రజలకు సౌకర్యవంతంగా చేశాం. గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. త్వరలో అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత ఇవ్వనున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నాం.
జగన్ ఐదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తుంటే చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బురదజల్లే కార్యక్రమాలకు కొంతమంది పేటీఎం బ్యాచ్‌లను పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే మీకు బుద్ది చెప్తారని హెచ్చరిస్తున్నాం. త్వరంలో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయం. నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా, సింగయ్యకు సంబంధించిన వీడియోలు వంటి విషయాలను కూడా వైసీపీ రాజకీయం చేస్తోంది. దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే.. దొర అయిపోతారా? అక్రమంగా ఇళ్ల పట్టాలు సృష్టించి ఎన్నికల్లో కొడుకును అందలం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులను (పేర్ని నాని) పక్కన కూర్చోబెట్టుకుని ప్రోత్సహిస్తారా? తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు.