- రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడే నాయకుడు చంద్రన్న
- తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి..
- 10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
- జులై నుంచి అర్హులందరికీ పెన్షన్ అందిస్తాం
- వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు
- శత్రువులపై పోరాటానికి ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తాం
- సత్యవేడు టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్
సత్యవేడు (చైతన్య రథం): మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని స్థానిక సంత ప్రాంగణంలో సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో మంత్రి నారా లోకేష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తాం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. శత్రువులపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అండగా నిలుస్తామన్నారు. ‘మన భూభాగంలోని పహల్గాంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అమాయక ప్రజలను నిర్దాక్ష్యణ్యంగా పొట్టనపెట్టుకున్నారు. నమో తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు అండగా ఉంటాం. వంద పాకిస్థాన్‌లు వచ్చినా మన దగ్గర మిసైల్ ఉంది. ఆ మిసైల్ పేరే ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయులను చంపిన వారిని వదిలిపెట్టకూడదనే లక్ష్యంతో పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సైనికులు మనకోసం పోరాడుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇది కొనసాగవచ్చు. పిడికిలి బిగించి అందరం వందేమాతరం నినాదం చేద్దాం అని పిలుపునిచ్చారు.
తోట చంద్రయ్య, అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి
నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతాననే మాటకు కట్టుబడి మీ ముందు నిల్చున్నా. కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేస్తుంటే వీరోచితంగా పోరాడిన అంజిరెడ్డి తాత తొడగొట్టి సవాల్ విసిరారు. ఆయనే నాకు స్ఫూర్తి. బూత్‌లో రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకునేందుకు రక్తం చిందించిన మంజులారెడ్డి నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడి పేరు నినదించమంటే.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అన్న తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. కార్యకర్తలను కలిసిన తర్వాతే రాష్ట్రపార్టీ ముందుకు వెళ్తుంది. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా మనకు కోటిమంది సభ్యులున్నారు. చంద్రబాబునాయుడు పిలుపుతో పోరాడి సత్యవేడు నియోజకవర్గంలో విజయం సాధించాం. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తాం. మహానాడు నాటికి కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం అని స్పష్టం చేశారు.
10 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 10 నెలల పాలనలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో ఎక్కడా వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క ఏపీలో తప్ప. దేశంలో ఎక్కడా వికలాంగులకు రూ.6వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క మన రాష్ట్రంలో తప్ప. మంచానికే పరిమితమైన వారికి ఎక్కడా రూ.15వేలు పెన్షన్ ఇవ్వడం లేదు. ఒక్క ఏపీలోనే ఇస్తున్నాం. జులై నుంచి అర్హులందరికీ పెన్షన్ అందిస్తాం. రేషన్ కార్డుల జారీప్రక్రియ కూడా చేపడతాం. వచ్చే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం కార్యక్రమాలు అమలుచేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు.
కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం
పార్టీలో సంస్కరణల కోసం చాలా కష్టపడుతున్నా. ఏ నిర్ణయమైనా కలిసికట్టుగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం. అలిగి ఇంట్లో పడుకోవద్దు. 2019నుంచి 2024 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చంద్రబాబుని, నన్ను అనేక ఇబ్బందులు పెట్టారు. గాజువాకలో పల్లా శ్రీనివాసరావును ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. నియోజకవర్గంలో ప్రత్యేక సమస్యలున్నాయి. అందుకే ఇద్దరు పరిశీలకులను నియమించాం. ఇక్కడ జరిగే ప్రతి విషయం మన అధ్యక్షుడికి తెలుసు. ఆయన కూడా కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కలిసి మాట్లాడుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని లోకేష్ కార్యకర్తలకు సూచించారు.
ప్రధాని మన కోరికలు నెరవేరుస్తున్నారు
రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పాడ్డాం. ప్రధాని మన అన్ని కోరికలు నెరవేరుస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. మనం అమరావతి కడుతున్నాం.. మనమే అమరావతి కడుతున్నాం అని మొన్నటి సభలో ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు పవనన్న కృషిచేస్తున్నారు. మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారు. ఆయనకు అండగా నిలిచేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోన్ ఇంఛార్జ్ దీపక్‌రెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి.నరసింహ యాదవ్, పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు, బాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీపతిబాబు తదితరులు పాల్గొన్నారు.