- సామాన్యులను అసామాన్యులుగా మార్చిన పార్టీ టీడీపీ
- కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోం
- ఇకపై కెఎస్‌ఎస్‌లో ఉన్నవారికే నామినేటెడ్, పార్టీ పదవులు
- సత్యవేడు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్
సత్యవేడు (చైతన్య రథం): ఈరోజు మనందరం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. అయితే మనవద్ద నమో (నరేంద్ర మోడీ) మిసైల్ ఉంది. ప్రధాని మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. భారత సైనికులు పాకిస్థాన్ పైకి వెళ్లి స్ట్రయిక్స్ చేస్తున్నారు, ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధం ప్రకటించారు. రాష్ట్రమంతా ప్రధానమంత్రి, భారత సైన్యానికి అండగా నిలబడాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సత్యవేడులో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడుతూ… మనందరం తొలుత భారతీయులం. మనకోసం సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్న సైనికులకు సంఫీుభావం తెలపాలన్నారు. పాదయాత్రలో మీ అందరికీ హామీ ఇచ్చా. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తా. పనిచేసే వారిని ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చాను, ఎప్పుడు మీ ప్రాంతానికి వచ్చినా మిమ్మల్నే ముందుగా కలుస్తానని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఉత్తమ కార్యకర్తలను కలిశాను. కార్యకర్తలు పార్టీ నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరగాలి. ఈరోజు నాయకత్వం అంతా మీ ముందుకు వచ్చింది. ఇదీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం అని లోకేష్ వ్యాఖ్యానించారు.
అలకలు వద్దు… మాట్లాడి పరిష్కరించుకుందాం
పార్టీ కేడర్‌లో ఉన్న మరో జబ్బు పేరు అలక. ఇది మనపార్టీ. పార్టీలో సంస్కరణల కోసం జగన్‌కంటే ఎక్కువగా నేను పార్టీలో పోరాడా. ఇది మనపార్టీ. సమస్యలు ఏవైనా ఉంటే మనం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొన్నిసార్లు సమయం పట్టవచ్చు కానీ, కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోం అని లోకేష్ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
కేడర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం
ఇకపై పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు రావాలంటే తప్పనిసరిగా కెఎస్‌ఎస్ బాధ్యులుగా ఉండి తీరాలి. నిజమైన కార్యకర్తలను గుర్తించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పార్టీ నేతలంతా కమిట్‌మెంట్‌తో పనిచేయాలి. మండలపార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్పను గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిని చేశాం. స్కూలు టీచర్ అనితను రాష్ట్ర తెలుగుమహిళ అధ్యక్షురాలిగా, హోంమంత్రిగా నియమించాం. కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో సామాన్య కార్యకర్త. ఓ సాధారణ పత్రికా విలేకరి. కాల్వ శ్రీనివాసులు కూడా అలాగే వచ్చారు. వారికి ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించాం. అదే టీడీపీ గొప్పతనం. కష్టపడి పనిచేసినవారికే పదవులు ఇవ్వాలన్నది బాబుగారి లక్ష్యం. అందుకే ఉత్తమ కార్యకర్తలను గుర్తించి అవార్డులు ఇస్తున్నాం. కమిటీలను పకడ్బందీగా నియమించుకొని ముందుకెళదాం. కార్యకర్తలు మీ క్లస్టర్, యూనిట్, బూత్‌పై దృష్టిసారించండి. వేరేవాళ్ల గురించి పట్టించుకోవద్దు. కార్యకర్తల కోసం జగన్‌కంటే మూడురెట్లు ఎక్కువగా పార్టీలో అంతర్గతంగా పోరాడుతున్నానని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు చెప్పా. అయితే నాలుగుగోడల మధ్యే ఆ పోరాటం ఉండాలి. పార్టీ తీసుకున్న అన్ని నిర్ణయాలతో ఏకీభవించాల్సిన పనిలేదు. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయాలను మాత్రం అందరం గౌరవించి అమలు చేయాల్సిందే. 14న పోలిట్ బ్యూరోకు ప్రిపేరవుతున్నాం, కార్యకర్తలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను చర్చిస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
రెడ్‌బుక్ అమలుపై డౌట్ వద్దు!
రెడ్‌బుక్‌పై ఎవరికీ ఎటువంటి డౌట్ అవసరం లేదు. మాటల్లోకాదు, చేతల్లో చూపుతాం. పార్టీ పిలుపు ఇచ్చిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా అమలుచేయాలి. పార్టీ అధ్యక్షుడినుంచి కెఎస్‌ఎస్ వరకు అందరూ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. గత ఏడాదిగా పార్టీ పెద్దగా కార్యక్రమాలు ఇవ్వలేదు. మహానాడు తర్వాత ఎవరినీ వదలిపెట్టను. వెంటపడి పనిచేయిస్తా. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అహంకారంతో వ్యవరించకూడదు. అలా చేయబట్టే వైసీపీకి 151నుంచి 11స్థానాలు వచ్చాయి. దేశంలో బాగా పనిచేసిన పార్టీలు ఓడటానికి అహంకారమే కారణం. అహంభావాన్ని ప్రజలు తిరస్కరిస్తారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు పడతాం. వైసీపీ నాయకుల తీరు ఇప్పటికీ మారలేదు. ఇప్పుడు కూడా వారు గతంలో లాగే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై ప్రజల్లో చైతన్యం తేవాలి. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దొంగపేపర్, టీవీ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మంత్రి లోకేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.