- మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్యేడం ఖాయం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి ప్రభుత్వాన్ని దూరం చేయాలనే కుట్రలు
- తనను ఓడిరచిన ప్రజలపై కక్ష సాధింపునకు జగన్ ఎత్తుగడ
- కూటమి ప్రభుత్వ అప్పులపై పిచ్చి ప్రేలాపనలు
- 30 ఏళ్లు అధికారంలో కాదు..జగన్ జీవితాంతం జైల్లో ఉండాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల ధ్వజం
అమరావతి (చైతన్యరథం): ఒక్కఛాన్స్ ఇస్తే రాష్ట్రం స్థితిగతులు మార్చేస్తా…మీ బతుకులన్నీ మార్చేస్తా…అని 2019 ఎన్నికల ముందు ఆర్భాట ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే…రాష్ట్రాన్ని 5 ఏళ్లలో 30ఏళ్లు వెనక్కి నెట్టాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఐదేళ్లలో రూ.12లక్షల కోట్లు పైబడి అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన రూ.60 వేల కోట్ల అప్పు.. రైతులకు, జగన్ రెడ్డి తన పాలనలో పెట్టిన పెండిరగ్ బకాయిలు, పెన్షన్లు, జీతాలకు వాడారే తప్ప….జగన్మోహన్ రెడ్డి మాదిరి స్కీముల చాటున స్కాములు చేయలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం స్కీముల పేర్లు చెప్పి అప్పులు చేయలేదనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు.
జగన్మోహన్ రెడ్డివి దోచుకునే స్కీములు అయితే…కూటమి ప్రభుత్వం తెచ్చే స్కీములు ప్రజలను సొంతకాళ్లపై నిలబెట్టేవి అనే విషయాన్ని జగన్ గమనించాలి. 2019-2024 మధ్య కాలంలో తాలిబన్ల మాదిరి పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చేస్తున్న వ్యాఖ్యలు దొంగే దొంగ..దొంగ..అని అన్నట్లు ఉంది. జగన్ పాలనలో రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారు. అవినీతి, అరాచకం రాజ్యమేలింది. ప్రజలను సంక్షేమానికి, అభివృద్ధికి దూరం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. మూడు ప్రాంతాలతో మూడు ముక్కలాటలాడి…ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని జగన్ అండ్ కో అనేక కుట్రలు చేశారు. వారానికి ఒకరోజు ఏపీకి వచ్చే టూరిస్టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమం, ప్రజల గురించి మాట్లాడడం చూస్తేంటే అతని మానసిక స్థితి ఇంకా బాగుపడినట్లు లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని యనమల ధ్వజమెత్తారు.
ప్రజలపై కక్ష పెంచుకున్న జగన్
తనను ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని రాష్ట్ర ప్రజలపై జగన్ కక్ష పెంచుకున్నాడు. మంచి పరిపాలన, ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చే ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేసి…ప్రజలకు లేని పోని అబద్ధాలు చెప్పి మోసం చేసి తాను అధికారంలోకి వచ్చి, ప్రజలపై కక్ష తీర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ప్రజలకు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మరోసారి అబద్ధాలతో తన అవినీతి పునాదులను నిలబెట్టుకోవాలని, తన అవినీతి సామ్రాజ్యాన్ని పునఃనిర్మించుకోవాలని ఆరాటపడుతున్నాడు. మనిషికి విషం ఎంత ప్రమాదమో…జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా అంతే ప్రమాదం అని గత ఐదేళ్లలో నిరూపితమైందని యనమల దుయ్యబట్టారు.
జీవితాంతం జైల్లో ఉండాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అడుగడుగునా ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి మరోసారి వారిని అధఃపాతాళానికి తొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలీకృతం కావు. మరోసారి జగన్ చేతిలో హత్యలకు గురికావడానికి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి వద్దు అని రాష్ట్రమంతా ఓటుతో తమ వైఖరిని విస్పష్టంగా వెల్లడిస్తే….జగన్మోహన్ రెడ్డి ప్రజల తీర్పును పలుమార్లు తప్పుబట్టడం…అవమానించడం వంటివి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలకు కాలం చెల్లింది. కూటమి ప్రభుత్వం….ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఐదేళ్ల పాటు అరాచకాలకు గురైన మహిళలు జగన్మోహన్ రెడ్డిని చీదరించుకున్నారు. కనీసం గత ఐదేళ్లలో రోడ్డు మీదకు రావాలన్నా భయపడిన మహిళలు..నేడు స్వేచ్ఛా వాయువులు పీల్చడం జగన్‌కు నచ్చడం లేదు. అందుకే రాష్ట్రం పై కక్ష పెంచుకుని, ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో రెచ్చగొట్టి, తన కక్ష తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జగన్ కుట్రలను రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారు, నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చేసిన తప్పులు, చట్టాల ఉల్లంఘనలు, దోపిడీలు, హత్యలు, ఇతర అరాచకాలకు 30ఏళ్లు సీఎంగా ఉండడం కాదు…జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని యనమల స్పష్టం చేశారు.