అమరావతి (చైతన్యరథం): రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ మంగళవారం నాడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020-2024 మధ్య రెండు సార్లు ఏబీవీ సస్పెండ్ అయ్యారు. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకూ మొదటి దఫా ఏబీవీని వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోమారు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని, అలవెన్సులను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా.. ఇటీవలే ఏబీవీపై నమోదైన అభియోగాలను వెనక్కు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కోనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం ఆరోపించింది. అనంతరం ఆయనపై రెండు దఫాలుగా సస్పెన్షన్ వేటు వేసింది.