మంగళగిరి(చైతన్యరథం): రాష్ట్రమంత్రి, యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సోమవారం ఉదయం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతల పెన్షన్ ను రూ.4వేలకు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ఈ పెంపును ఏప్రిల్ నుండి వర్తింపజూసి, మూడు నెలల బకాయిలు కలిపి 7వేలరూపాయల పంపిణీ చేశారు. యువనేత నారా లోకేష్ ఇలాకాలో పెంచిన పెన్షన్ల అందజేత కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడంతో ఇక్కడి అవ్వాతాతల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబునాయడు, లోకేష్ గ్రామంలోకి అడుగిడగానే ఇరువురికీ గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. పెనుమాక కూడలి నుంచి నేతలిద్దరూ కాలినడకన గ్రామస్తులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పాములు నాయక్ ఇంటివద్దకు చేరుకున్నారు. పెనుమాక ఎస్టీ కాలనీకి చెందిన పాములు నాయక్ కు వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ ను మంత్రి లోకేష్ సమక్షంలో చంద్రబాబునాయుడు అందజేశారు. ఈ సందర్భంగా పాములు నాయక్ కుటుంబసభ్యులు తమకు ఇల్లులేదని చెప్పగా, అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఇంటి మంజూరు పత్రం అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా నాయక్ కుటుంబసభ్యులు ఇచ్చిన తేనీరు సేవించిన ముఖ్యమంత్రి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరిలో గెలిచింది, ఆ తర్వాత గెలవలేదు… 2019లో 5,350 ఓట్లతో నేను ఓడిపోయాను, అయినా నియోజకవర్గాన్ని వీడకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మంగళగిరి ప్రజలకు అండగా నిలిచానన్నారు. అందువల్లే తనను ఇక్కడి ప్రజలు రికార్డుస్థాయి మెజారిటీతో గెలిపించారని అన్నారు. మీ సహకారంతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. అనంతరం యువనేత లోకేష్ స్థానికులను కలిసి వినతులు స్వీకరించి ఫోటోలు దిగారు. స్థానికంగా ఓ మహిళ నడుపుతున్న షాపు కు వెళ్లి లోకేష్ పెన్ కొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగుడు ముకేష్ రాజధాని నిర్మాణానికి రూ.10 వేల సాయాన్ని అందజేశారు.