విజయవాడ: వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఒక్క బస్సుకూడా కొనలేదని, ఉన్న బస్సులకు మరమ్మతులు కూడా సరిగా చేయించలేదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్రెడ్డ్డి అన్నారు. గురువారం ఆయన విజయవాడ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ అని చెప్పారు. ప్రయాణికులు, ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్టీసీకి వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి.. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ల దుస్థితి మారాలి.. రోడ్లు మారితేనే ప్రయాణికులు సంతోషంగా గమ్యస్థానాలకు చేరతారు. ప్రయాణికులు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం.
ఉచిత ప్రయాణంపై వచ్చే 15 రోజుల్లో కమిటీ వేస్తాం. రెండు పక్క రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తాం. నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీకి, ఉద్యోగులకు నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకపై ఉద్యోగులు చనిపోతే ఇచ్చే అంత్యక్రియల ఖర్చు రూ.15 నుంచి రూ.25 వేలకు పెంచుతాం. దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతాం. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొంటాం. బస్ స్టేషన్లలో భోజన సదుపాయాలు, టాయిలెట్లు మెరుగ్గా ఉండేలా చూస్తాం. భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ చేపడతాం. విజయవాడ బస్టాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణంపై అధికారులతో చర్చిస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.