- రౌడీలను చూసి భయపడేది లేదు..
- దాడులు, బెదిరింపులను గట్టిగా ఎదుర్కొంటాం
- నాడు పులివెందులలో నామినేషన్లు వేయనీయలేదు..
- నేడు కుప్పం, పిఠాపురంలో స్వేచ్ఛగా నామినేషన్లు
- గొడ్డలి పార్టీ అక్రమాలను జెన్ జీ భుజాన మోయాలా?
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీత
- వైసీపీ హయాంలో ఎన్నికల అక్రమాల వీడియోలు ప్రదర్శించిన సీఎం
అమరావతి (చైతన్య రథం): హింస అనేది తన జీవితంలోనే లేదని, తన డిక్షనరీలో ఆ పదానికే చోటు లేదని ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే రౌడీలను చూసి భయపడేది లేదని, దాడులు, బెదిరింపులను ప్రభుత్వపరంగా, పార్టీపరంగా గట్టిగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేరప్రవృత్తిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, గతంలో ఆ పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు, ప్రస్తుత ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న ఘటనలకు సంబంధించిన వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. సోమవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
యువతను పావులుగా వాడుకోవద్దు కార్లతో మనుషులను ఢీకొట్టించడం, తొక్కించడం వంటి ఘటనలతో నేరప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రప్పా రప్పా రాజకీయాలు చేస్తూ, కరుడుగట్టిన నేరాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
మంచి వారిని సైతం నేరస్తులుగా మార్చే ధోరణి తగదన్నారు. జెన్-జీ యువతకు ఎలా మేలు చేయాలనే ఆలోచన చేయకుండా, వారిని రాజకీయ పావులుగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాను చేసిన అవినీతి, అక్రమాల నుంచి రక్షణ పొందేందుకే వైసీపీ అధినేత జెన్ జీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ చేసిన అకృత్యాల నుంచి జెన్ జీ కాపాడాలా? అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత బెంగళూరు నుంచి వచ్చి మూడు గంటలపాటు మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి, తన సొంత ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయించుకుని తిరిగి బెంగళూరుకు వెళ్లిపోతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బెంగళూరులో ఉంటూనే ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై నిందలు మోపినట్లే, ఇప్పుడు కూడా వైసీపీ చేసిన హింసకు తనను బాధ్యుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
నాడు అధికార దుర్వినియోగం.. నేడు దాడులంటూ విమర్శలు
గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ ఏకగ్రీవాలతో పాటు ప్రస్తుత ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు సాగిస్తోన్న అరాచకాలకు సంబంధించిన వీడియోలను చంద్రబాబు మీడియాకు ప్రదర్శించారు. రాజకీయాలే ప్రజల తలరాతలను మారుస్తాయని, మంచి నాయకులను ఎన్నుకుని, మంచి ప్రభుత్వాలను కొనసాగించుకోవాలని ప్రజలకు సూచించారు. 2014లో ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు 2 శాతం మాత్రమే ఉండగా, జెడ్పీటీసీ స్థానాల్లో 0.09 శాతంగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగంతో ఎంపీటీసీ స్థానాల్లో 24 శాతం, జెడ్పీటీసీ స్థానాల్లో 19 శాతం ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపించారు.
ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేందుకు అప్పట్లో చట్టం తీసుకొచ్చారని, ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు వారి ఇళ్లలో అక్రమంగా మద్యం సీసాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయని విమర్శించారు. పులివెందుల వంటి ప్రాంతాల్లో నామినేషన్లు వేయనీయలేదని గుర్తుచేశారు. అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అక్రమాలను ప్రశ్నిస్తే, దాన్నే తప్పుబట్టారని అన్నారు. చివరకు అప్పటి ఎన్నికల కమిషనర్ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో కుప్పం, పిఠాపురం, పులివెందుల సహా అన్ని ప్రాంతాల్లో వైసీపీతో పాటు వివిధ పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేశారని చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైన సందర్భాలు లేవని వ్యాఖ్యానించారు.
చెప్పాం.. చేస్తున్నాం
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓటు షేర్‌తో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తాను కలిసి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని, ఇది అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమాల్లో ఒకటని పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’, ‘స్త్రీశక్తి’, ‘దీపం-2.0’ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నం, విజయవాడల్లో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చామని, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను దోచుకునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ప్రజల ఆస్తులపై అప్పటి ముఖ్యమంత్రి తన బొమ్మలు వేసుకున్నారని విమర్శించారు. గత పాలకుల హయాంలో దేవాలయాల పవిత్రతకు భంగం కలిగిందని, ప్రసాదాల తయారీలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని ఆరోపించిన చంద్రబాబు, ప్రస్తుతం దేవాలయాల్లో పవిత్ర వాతావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చంద్రబాబు వెల్లడించారు. డేటా సెంటర్ల నుంచి రక్షణ రంగ ప్రాజెక్టుల వరకు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2029 నాటికి 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పట్టణాలు, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశు భ్రమైన వాతావరణం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.













