- అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు
- రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా చేస్తాం: అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం: తనకు కేంద్ర మంత్రి పదవి దక్కటం శ్రీకాకుళం జిల్లా ప్రజల విజయమని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం ఆత్మీయ అభినందన సభ జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సిక్కోలు ప్రజల కల నిజమైందన్నారు. సిక్కోలు ప్రజల్లానే మోదీ, చంద్రబాబు తనపై దృష్టి పెట్టారని, చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని ప్రస్తావించారు. ఇది సిక్కోలు ప్రజల విజయమని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి అయినా నా స్వభావం మారదు. కష్టం, నష్టంలో సిక్కోలు ప్రజలు నాకు అండగా ఉన్నారు. మంత్రి పదవిని ఉపయోగించుకొని జిల్లా సమస్యలు పరిష్కరిస్తాను. జిల్లా రాత మారాలి. 5 సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేస్తాను. 10 సంవత్సరాల తన కష్టాన్ని చూసి మంత్రి పదవి ఇచ్చారని, రాష్ట్రానికి ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. నిప్పులాంటి మనిషి చంద్రబాబుని జైల్లో పెట్టారు. చిత్ర హింసలు పెట్టిన వారిని బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడన్నారు.
గాలికి పుట్టిన పార్టీలు గాలికే పోతాయి: అచ్చెన్నాయుడు
ఇక ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దుర్మార్గమైన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించాడని జగన్పై మండిపడ్డారు. గాలికి పుట్టిన పార్టీలు గాలికే పోతాయి. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గాడిలో పెట్టి అగ్రగామిగా తయారు చేస్తాం. మాది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. నన్ను గెలిపించిన జిల్లా ప్రజలకి జన్మాంతం సేవ చేసుకుంటా. జిల్లా రైతాంగం ఇబ్బందులు తొలగిస్తా. నా సత్తా చూసి మంత్రి శాఖ ఇచ్చారు. అభివృద్ధి చేసి చూపిసానని అచ్చెన్నాయుడు అన్నారు.
ఘనస్వాగతం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. వీరిద్దరు సోమవారం ఉదయం విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరిని నియంత్రించలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళానికి 200 కార్లు, 350 బైకులతో భారీ ర్యాలీగా చేరుకున్నారు.