- రాష్ట్రానికి పట్టిన పీడ వదలి, ప్రజా ప్రభుత్వం తిరిగి వచ్చింది
- ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ ప్రభుత్వం నడుచుకుంటుంది
- సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీల అమలు కోసం చంద్రబాబు సంతకాలు
- ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
- టీడీపీ జాతీయ కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పాటు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4 వేలకు పెన్షన్ పెంపు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసిన శుభసందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ తరుణంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో కూడా సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ బాణాసంచా కాల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య, టీడీ జనార్ధన్ మాట్లాడారు.
ప్రజలందరికీ మరపురాని దీపావళి పండుగ: వర్ల రామయ్య
నరకాసుర వధ జరిగి ప్రజాపాలన మొదలైందని వర్ల రామయ్య సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఐదు ఫైళ్ల పైనే మొదట సంతకాలు పెట్టారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి రద్దు చేశారు. అవ్వాతాతలకు ఇచ్చే రూ.3 వేల పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతున్నట్లు మూడవ సంతకం పెట్టారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు. ప్రజలు, పెద్దలు, అధికారుల సమక్షంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. దీనిపై రాష్ట్రమంతటా బాణసంచా పేలుస్తూ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తబరిచారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ మరపురాని దీపావళి పండుగ. ప్రతీ సంవత్సరం వచ్చే దీపావళి కంటే ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైనది. రాష్ట్రానికి పట్టిన పీడ వదలడమే కాకుండా ప్రజా పరిపాలన తిరిగి వచ్చింది. ఐదేళ్లకోసారి వచ్చే ఇలాంటి దీపావళి పండుగలు మరెన్నో జరుపుకుంటూ చంద్రబాబు నాయకత్వంలో ప్రజా పాలన కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఈ విజయోత్సవాల్లో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్దేశకులు. విర్రవీగి ప్రవర్తిస్తే ఒక్క క్షణం కూడా ప్రజలు భరించరు. దీనికి ఉదాహరణ ప్రత్యక్షంగా నేడు మన రాష్ట్రంలో కనపడుతోంది. జగన్ రెడ్డి అరాచక, దుర్మార్గపు, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన మాకొద్దని ప్రజలే నిర్దేశించారు. అందుకే ప్రజాప్రభుత్వానికి పట్టం కట్టారు. అందుకు అనుగుణంగానే ప్రజాభీష్ట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని వర్ల రామయ్య అన్నారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే చంద్రన్న ధ్యేయం: టీడీ జనార్ధన్
గత ఐదేళ్లుగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ చీకటి రాజ్యంలో జీవించిన రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లభించిందని టీడీ జనార్ధన్ అన్నారు. జగన్ పాలనలో జనానికి వాక్ స్వాతంత్య్రం లేదు. కనీసం నచ్చిన పోస్టును వేరొకరికి ఫార్వర్డ్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. ఏ క్షణాన ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న భయంతో బతికారు. కానీ నేడు వేయి టన్నుల భారం తల మీద నుండి దిగినంత సంతోషంగా రాష్ట్రంలో ప్రజలు పండుగగా చేసుకుంటున్నారు. నియంతలను, అహంకారులను ప్రజలు సహించరనేదానికి ఈ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే నిదర్శనం. చరిత్రలో కూడా అహంకారంతో రాజ్యమేలిన వారెవరూ బతికి బట్ట కట్టలేదు. ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టే ప్రజలు 2019లో ఆఖరి ఛాన్స్ ఇచ్చారు. ఇక వీరు రాజకీయాలకు పనికి రారు అనేటటువంటి తీర్పును ప్రజలిచ్చారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వయస్సుకు అతీతంగా అందరూ ఏకమై ఇచ్చిన తీర్పు ఇది.
ప్రజల బాధను అర్ధం చేసుకొని వారి మేలు కోసం ఎన్డీఏ తరపున ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కొన్ని హామీలనిచ్చారు. అందుకే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా యువతను జగన్ రెడ్డి మోసం చేశారు. అందు కోసమే మెగా డీఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడంతో పాటు చివరకు సెక్రటేరియట్‌ను కూడా తాకట్టు పెట్టడం భారతదేశంలో ఎక్కడా జరగలేదు. అన్నీ అయిపోయి చివరకు ప్రజల ఆస్తులపై పడి జగన్‌రెడ్డి ఒక తప్పుడు చట్టాన్ని తీసుకువచ్చారు. అటువంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకాన్ని చంద్రబాబు చేశారు. రాష్ట్రంలో మొదటగా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుది. కానీ జగన్ రెడ్డి మాయమాటలు చెప్పి వెయ్యి రూపాయిలు పెంచడానికి ఐదేళ్లు గడిపారు. చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలుకు పెంచారు. పేదలు, కూలోళ్లు పొట్ట నింపుకునే అన్న క్యాంటీన్లను దుర్మార్గపు జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. వాటిని పునఃప్రారంభిస్తున్నట్లు నాలుగో సంతకం చేశారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు శంఖారావం పూరించారు. ఈ శుభసందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ రెండు రోజుల పాటు సంబరాలు చేయబోతున్నారని జనార్ధన్ తెలిపారు.