టిడిపి అధికారం లోకి రాగానే గాండ్ల కులస్తులకు ఆర్థికంగా చేయూత నిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం శింగనమల నియోజకవర్గం లో గాండ్ల సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. తామంతా దశాబ్దాలుగా నూనె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, టిడిపి హయాంలో బిసి కార్పొరేషన్ ద్వారా వ్యాపారులకు సబ్సిడీ లోన్ లు ఇచ్చేవారని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది లేకుండా చేశారని వారు లోకేష్ కు చెప్పారు. తమ సమస్యలను సానుభూతితో పరిష్కరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వం బిసిలు అందరినీ మోసం చేసిందని విమర్శించారు. బిసి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు అని చెప్పారు. టిడిపి అధికారంలోకి రాగానే న్యాయబద్ధమైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.