ఆ చిన్నారి మూగమనసుకి మాట వచ్చింది. తండ్రితో కలిసి వచ్చి తన చికిత్సకి సాయం అందించిన చంద్రబాబు తనయుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. మాటవచ్చిన ఆ మూగమనసు పేరు పవన్. తండ్రి పేరు బర్మా రమేష్. సింగనమల నియోజకవర్గం, గార్లదిన్నె మండలం, బనకచెర్ల ప్రాజెక్టు వద్ద నివాసం. కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు రమేష్. మూడేళ్ల కొడుకు పవన్‌కి పుట్టుకతో వినికిడి సమస్య వల్ల మాటలు రాలేదు. అప్పులుచేసి కర్ణాటకలోనే ఆస్పత్రులు తిప్పుతూ నానా తిప్పలు పడేవాడు.
కొడుకుకి ఎలాగైనా మాట తెప్పించాలనే రమేష్ బాధలు చూసిన అక్కడి తెలుగువారు, మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యానికి సాయం చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్లి ప్రయత్నించు అని చెప్పిన సలహాతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2017వ సంవత్సరంలో టిడిపి సర్కారు మంజూరు చేసిన రూ.5.20లక్షలతో అపోలో హైదరాబాద్‌లో పవన్ కి చికిత్స చేశారు. పవన్ కి మాట వచ్చింది. వినికిడి యంత్రాలు అమర్చారు. బర్మా రమేష్ ఆనందానికి అవధుల్లేవు. తాను బిడ్డకి జన్మనిస్తే, మాట వచ్చేలా వైద్యానికి సాయం అందించి చంద్రబాబు పునర్జన్మ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశాడు.
యువగళం పాదయాత్రలో సింగనమల నియోజకవర్గం వచ్చిన నారా లోకేష్‌ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం సహకారంతో మాట వచ్చిన పవన్, 9వ ఏట అడుగుపెట్టి బనకచెర్లలో చదువుకుంటున్నాడని లోకేష్‌కి వివరించారు.