.ఎంపీ మాధవ్ వెకిలివేషాలతో గంగపాలైన రాష్ట్ర ప్రతిష్ట
.ఘటనపై మహిళా మంత్రులు స్పందించరా?
.మాధవ్ చేష్టలకు జగన్‌రెడ్డి సమాధానం ఏంటీ?
.సస్పెండ్ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తారా?
.మహిళాకమిషన్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు?
.న్యూడిస్ట్‌ని సమర్థిస్తూ వైసీపీ మహిళా నేతల సిగ్గులేని వ్యాఖ్యలు
(చైతన్యరథం స్పెషల్ డెస్క్)
హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడు. ఆయన వెకిలివేషాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నా మార్ఫింగ్ అని బుకాయిస్తున్నాడు. ఈ విషయంలో వైసీపీ అగ్రనేతలతోపాటు మహిళా మంత్రులు తానేటి వనిత, రోజా వంటి వారు కూడా నీళ్లునమలడం ఆ పార్టీ దిగజారుడుకు నిదర్శనం. మాధవ్ అసహ్యంగా, నగ్నంగా కనిపించిన ఆ వీడియోను చూసి దేశమంతా నవ్వుతోంది. మాధవ్ ఎంపీ కావడం వల్ల ఢల్లీతోపాటు దేశమంతటా దానిని చూశారు. ఇటువంటి వారిని వైసీపీ లోక్‌సభ సభ్యునిగా నిలిపిందా అని ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. ఈ వీడియోతో దేశంలో ఆ పార్టీ పరువుతోపాటు మన రాష్ట్ర పరువు కూడా పోతోంది. మాధవ్ చేత లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయించినా, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కొంతవరకు వైసీపీ పరువు, రాష్ట్రం పరువు నిలిచేవి. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నా వైసీపీ ఇంకా మీనమేషాలు లెక్కించడం విస్మయం కలిగిస్తోంది. ఎంపీగా ఉన్న వ్యక్తి బట్టలన్నీ విప్పి వెకిలివేషాలు వేసింది గాక కులం పేరు చెప్పి మరీ ఆ కులం పరువుకూడా తీశాడు. జగన్ రెడ్డి కూడా మాధవ్ ను సస్పెండ్ చేసే సాహసం ఎందుకు చేయడంలేదు? జగన్ రెడ్డికి ఆ వేషాలు బాగా నచ్చి ఉంటాయి. ఆ చేష్టలకు చిరునవ్వులు నవ్వుకుంటున్నట్లున్నాడు. లేకపోతే ఇంతకాలం ఎందుకు ఆగుతాడు. ఆ వీడియో మార్ఫింగ్ చేసింది అవునోకాదో తేలడానికి ఒక్క రోజు చాలు. అధికారంలో ఉన్న వారికి ఒక్క పూట చాలు. ఈ విషయంలో పార్లమెంటు కూడా ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. మనదేశ రాజ్యాంగం ప్రకారం పార్లమెంటే అత్యున్నతమైన వ్యవస్థ. అటువంటి పార్లమెంటులో సభ్యుడు ఇంత అసభ్యకరంగా ప్రవర్తిస్తే స్పీకర్ మౌనంగా ఉండటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ రెడ్డి మాధవ్ పై చర్యలు తీసుకోకపోగా, ప్రజల ఆలోచనలను ఆ సమస్య నుంచి మరల్చడానికి కులం చిచ్చు రగిలించడానికి పూనుకున్నాడు. అతనిపై చర్యలు తీసుకుంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని భయపడుతున్నట్లున్నాడు. చర్యలు తీసుకోకపోతేనే పార్టీ పరిస్థితి ప్రజల్లో దిగజారిపోతుందని తెలుసుకోలేక పోతున్నాడు. పృథ్వీరాజుకు సంబంధించి ఆడియో లీక్ అయితేనే అరగంటలో అతనిని ఎస్వీబీసీ పదవి నుంచి తొలగించాడు. మాధవ్ పై చర్యలు తీసుకోవడానికి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? మహిళాలోకమంతా అసహ్యించుకుంటున్నా జగన్ రెడ్డి మౌనం ఎందుకు వహిస్తున్నాడు.
వైసీపీలో 81 మంది నేరచరిత్ర గలవారికే టిక్కెట్లు
నేర చరిత్ర ఉన్న జగన్ రెడ్డిపై 32 కేసులు ఉన్నాయి. అందుకే ఆయన నేర చరిత్ర ఉన్న మరో 81 మందికి వైసీపీ టికెట్లు ఇచ్చాడు. వారిలో 50 మందికి పైగా తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నవారే ఉన్నారు. తనతోపాటు 32 కేసులు ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చాడు. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా నేర చరిత్రను పరిశీలించి ఇచ్చినట్లున్నాడు. అలాంటప్పుడు ఇలాంటివారు గాక ఎలాంటి వారు ఉంటారు. అటువంటి వేషాలు వేసిందిగాక, బీసీ అని చెప్పుకుని బీసీల పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. జనం ఆ వీడియో నిజమైనదో, మార్పింగో తెలుసుకోలేనంత అమాయకులు ఏమీ కాదు. ఈ రకమైన శాడిస్టులు ఆ పార్టీలో పెరిగిపోతున్నారని ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇటువంటి వ్యవహారాలతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ వారు వారి గొయ్యిని వారే తవ్వుకుంటున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకునేవేళ ఈ దరిద్రం ఏంటి?
75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకో వలసినవేళ మన రాష్ట్రానికి ఈ దరిద్రం ఏంటని రాష్ట్ర ప్రజలు వాపోతున్నారు. ప్రపంచలోని తెలుగువారందరూ ఇప్పుడు ఈ దరిద్రం గురించే చర్చించుకోవలసిన పరిస్థితి ఏర్పడిరది. రాష్ట్రంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు ఆపాదించి ట్వీట్లు పెట్టే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు కుయ్ అనడంలే కయ్ అనడంలే. పత్తాలేడు. అతనే కాదు, ఇతర వైసీపీ నేతలకు సిగ్గూశరం ఉన్నట్లు కనిపించడంలేదు. ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? వారు కూడా ఈ రకమైన చర్యలను స్వాగతిస్తున్నారా? మహిళా మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ అందరూ సిగ్గులేకుండా దిగజారి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకే నోటీస్ ఇచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక మహిళ పట్ల అంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు. ఓ బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇవ్వడానికా మహిళా కమిషన్ ఉంది? ఆ పదవిలో కొనసాగడానికి ఆమెకు అర్హత ఉందని అనుకుంటుందా? గంట, అరగంట అని ఆడియో లీకులు వచ్చినా ఆ వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చిన జగన్ రెడ్డి ఈ మాధవ్ ను ఎక్కడ కూర్చోబెడతాడోనని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. జగన్ రెడ్డి ఉన్నత పదవులు ఇవ్వడానికి అటువంటి చేష్టలే అర్హతల్లా ఉన్నాయి. ఇలాంటి వేషాలు వేసేవారు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు వంటి వాటి కోసం పోరాడతారని అనుకోవడం మన భ్రమ.