.వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక ప్రమాదాలు
.కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు
.టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమణాలపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ వస్త్రపరిశ్రమలో జూన్ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. నాటి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినా ఇప్పటి వరకు ప్రమాదానికి కారణాలేంటో కమిటీ చెప్పలేకపోయిందన్నారు. అదే పరిశ్రమలో ఇప్పుడు మరోసారి వెలువడిన విషవాయువును వల్ల దాదాపు 100 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు. అలాగే నిన్న తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలోని బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఏడాదే ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించినట్లు వివరించారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ మొదలుకుని వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమై పోయిందన్నారు.
కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు
కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవని, లోపం ప్రభుత్వంలోనే ఉందని పేర్కొన్నారు. పరిశ్రమల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలని హితవు పలికారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు