.కుంటి సాకులతో నేతన్న నేస్తం పథకం అందకుండా చేస్తున్నారు
.ధర్మవరంలో పరిస్థితులపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం
ధర్మవరం: అర్హులైన వారికి నేతన్న నేస్తం అందించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయని గొప్పలు చెప్పడం కాదు.. ఒకసారి వాస్తవ పరిస్థితిని చూడాలని ప్రభుత్వానికి ధర్మవరం నియోజకవర్గ బాధ్యులు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. ధర్మవరంలో అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం అందించడం లేదంటూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ధర్మవరంలో నిబంధనల పేరుతో అర్హులకు నేతన్న నేస్తాన్ని తొలగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయం కంటే ఎక్కువగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని.. గత మూడేళ్ళలో చేనేతలు వాడే ముడి పట్టు ధరలు అయిన వార్పు, రేషం, జరీ, కలర్ అద్దకం ధరలు దాదాపు 100 శాతం పైగా పెరిగాయన్నారు. రెండేళ్లలో కోవిడ్ కారణంగా చేనేత రంగం చితికిపోయిందని వివరించారు. పెరిగిన చేనేత ముడి సరుకుల ధరల వల్ల నేతన్న నేసిన చీరలకు గిట్టుబాటు ధరలు లభించక ధర్మవరం నియోజకవర్గంలో మూడేళ్ళ కాలంలో దాదాపు 41 మంది ఆకలి చావులకు, బలవన్మరణాలకు పాల్పడ్డారని కలెక్టర్ కు తెలిపారు. ఇప్పుడు నిబంధనల పేరుతో 1029 మంది చేనేత కార్మికులు నేతన్న నేస్తం పథకానికి దూరం కాబోతున్నారన్నారు. పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణములో ఉన్న నివాసముల నిబంధన అనేది శాపంగా మారిందన్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి కొంత ఎక్కువ విస్తీర్ణంలో మగ్గం ఉంటుందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత నిబంధనల ప్రకారం నేతన్న నేస్తం పథకం అమలు చేయాలని.. చేనేతలు వాడే ముడి పట్టు ధరలు, జరీ ధరలను తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాల సీజన్ లో మగ్గాల గుంతలలో నీరు ఉబుకుతున్నందున 4 మాసాలకు నెలకు రూ.పది వేల ప్రకారం చేనేతలకు వర్షాకాల భృతి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. చెత్త పన్ను కట్టలేదని కూడా నేతన్న నేస్తం అందకుండా చేస్తున్నారని.. ఇలాంటివన్నీ స్థానిక నేతకు కనిపించడం లేదా అని శ్రీరామ్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి పోయిరావడం కాదు, సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం చూపాలన్నారు. మేం చేస్తున్న నినాదాల వెనుక ఎందరో ఆర్తనాదాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని.. 175 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.