.ఎక్కడికక్కడే టిడిపి నేతల గృహనిర్బధం, అరెస్టు
.రోడ్లపై బైఠాయించిన తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించతలపెట్టిన దళిత గర్జన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంతోపాటు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసింది. గృహనిర్బంధం చేసినవారిలో దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య,బుద్దా వెంకన్న,అశోక్ బాబు,గద్దె రామ్మోహన్ తదితరులు ఉన్నారు. విజయవాడ వచ్చేవారిని ఎక్కడక్కడే పోలీసులు అడ్డుకున్నారు. దళిత నేతలు అనేక మందిని అరెస్టు చేశారు. దాంతో దళిత నేతలు అనేక చోట్ల ఆందోళనలు చేశారు. తమని ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పమని పోలీసులను నిలదీశారు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుతోపాటు పలువురు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. దాంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని విజయవాడ ఒకటో పట్టణ పోలీస్స్టే షన్ ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనకు దిగిన తెలుగు యువత నాయకులు,టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎం.ఎస్. రాజును కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
దళితులపై పెరుగుతున్న దాడులు: దేవినేని ఉమ
జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని జగన్ సర్కార్ నీరుగార్చిందని మండిపడ్డారు. మూడేళ్ల పాలనలో ఎస్సీలకు జగన్ మొండిచేయి చూపించారన్నారు. దళితులకు కేటాయించిన వేలకోట్ల సబ్ప్లా న్ నిధులను వైసీపీ నేతలు దారిమళ్లించారని చెప్పారు. ఆ నిధులను రాబట్టి దళితుల సంక్షేమానికి కేటాయించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
మోసాలు బయటపడతాయని భయం: బోండా ఉమ
దళిత గర్జన జరిగితే దళితులకు జరుగుతున్న మోసాలు భయటపడతాయనే భయం జగన్ ప్రభుత్వానికి పట్టుకుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. జగన్ చేస్తున్న మోసాలు దళిత సోదరులు గ్రహించాలన్నారు. దళితు లకు జగన్ ఏం చేశాడో చెప్పాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. కోర్టులు ముందస్తు నిర్బంధాలు చేయవద్దన్నా ప్రభుత్వ వత్తిడితో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు జగన్ రెడ్డి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో దళితులకు స్వర్ణ యుగం అని బోండా ఉమా పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో దళితులకు న్యాయం: మాజీమంత్రి జవహర్
టీడీపీ హయాంలోనే దళితులకు న్యాయం జరిగిందని మాజీమంత్రి జవహర్ అన్నారు. టీడీపీ దళిత గర్జనతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని చెప్పారు. వైసీపీ పాలనలో ఒక్క దళితుడైనా లబ్ధి పొందాడా? అని ప్రశ్నించారు.
నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
గుంటూరులో టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడ బయలుదేరిన ఆనందబాబును పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం దుర్మార్గ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఎస్సీలు, గిరిజనులకు అమలవుతున్న పథకాలు తొలగించినట్లు తెలిపారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు చేసిన పథకాలను పునరద్ధించాలని కోరారు. నాయకుల ప్రాథమిక హక్కులను భంగం కల్పించే హక్కు ఎవరిచ్చారని నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. దళితుల ఓట్లతో గెలిచి.. వారికే ద్రోహం చేశారని విమర్శించారు. అంబేద్కర్ పేరిట విదేశీ విద్యా దీవెన పథకం పెడితే, దాని పేరు మార్చారని, అంబేద్కర్ పేరు మార్చే దుర్మార్గపు పని జగన్ తప్ప ఎవరూ చేయలేరని అన్నారు. దళితులకు రూపాయి కూడా రుణం ఇవ్వని ముఖ్యమంత్రి… కార్పొరేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. దళిత గిరిజనులకు ఒక్క పథకం కూడా లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం టీడీపీ ఆందోళనకు పిలుపిస్తే అడ్డుకున్నారని, పోలీసులు తన ఇంటికి వచ్చి నిర్బంధించారని చెప్పారు. ఎందుకు అడ్డుకున్నారో పోలీసులు చెప్పటం లేదన్నారు. తన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని, ఎవరు చెబితే మమ్మల్ని ఆపుతున్నారు? ముఖ్యమంత్రా? లేక సజ్జల ఆదేశాలతో పని చేస్తున్నారా? అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు అడ్డగోలుగా పెరిగాయని నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసుల మొహరింపు
మార్టూరు మండలం ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసుల మొహరించారు. ఆయనతోపాటు ఆ ఆఫీస్ లో ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు సురేష్ తదితరులను విజయవాడ దళిత గర్జనకు వెళ్లడానికి అనుమతించలేదు.
ఇది పిరికిపంద చర్య.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్
విజయవాడలో టీడీపీ దళిత గర్జనకు అనుమతి నిరాకరించడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ పేర్కొన్నారు. జగన్ రెడ్డి పాలనలో దళిత సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అన్యాయంపై నిరసన తెలపడానికి వస్తున్నవారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్ చేసిన టీడీపీ దళిత నేతలను వెంటనే విడుదల విడుదల చేయాలని నవీన్ కుమార్ డిమాండ్ చేశారు.
శాంతియుత ధర్నాలను అడ్డుకోవడం దారుణం: దేవతోటి
వైసీపీ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాల అమలు కోసం తెలుగు దేశం పార్టీ నిర్వహించే శాంతియుత ధర్నాలను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని టీడీపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు. ఎస్సీల పథకాలు రద్దు చేయకపోతే అసలు ధర్నాలే ఉండవు కదా అని అన్నారు. రద్దు చేసిన పథకాల కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్ చేయడం వైసీపీ దళిత వ్యతిరేక విధానం అని స్పష్టంగా అర్థమవుతోందని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.