.టీడీపీ పేరెత్తితే వైసీపీకి ఓ రేంజ్‌లో వణుకు
.భయంతో ఎక్కడికక్కడ టీడీపీ నేతల గృహనిర్బంధం
.విజయవాడ వెళుతున్నవారిని అడ్డుకుని అరెస్టులు
(చైతన్యరథం స్పెషల్ డెస్క్)
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంతోపాటు పార్టీ రోజురోజుకూ బలపడుతోంది. దాంతో టీడీపీ పేరెత్తితే వైసీపీ నేతల్లో ఓ రేంజ్ లో వణుకుపుడుతోంది. టీడీపీ ఏ కార్యక్రమం తలపెట్టినా వారు భయపడిపోతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నందున పోలీసులను ద్వారా టీడీపీ నేతలను, కార్యకర్తలను వేధించడం మొదలుపెట్టారు. పోలీసులు కూడా దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు నీతి, నియమాలు, చట్టాన్ని గాలికి వదిలేసి అధికార పార్టీవారు ఏం చెబితే అది చేస్తున్నారు. కానీ, టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా టీడీపీ మహిళలు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ…అన్ని వర్గాల వారు కూడా ఇటువంటి వేధింపులను, బెదిరింపులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎదురుతిరిగి పోరాడటానికి సిద్ధపడ్డారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో టీడీపీ ‘దళిత గర్జన’ కార్యక్రమం చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చిన జగన్
టీడీపీ పాలనలో పలు పథకాల ద్వారా ఎస్సీ,ఎస్టీలకు సాయం అందించిందిక్షలాది మంది లబ్ధి పొందారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి జగన్ రెడ్డి తూట్లు పొడిచి దళితుల ద్రోహిగా మారాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లోనూ దళితులకు అన్యాయం చేసింది. చేస్తూనే ఉంది. దళితులను నమ్మించి నట్టేట ముంచింది. దళిత మహిళలపై అత్యాచార ఘటనలు రాష్ట్రంలో భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులపై వైసీపీ నాయకుల వేధింపులు పెరిగాయి. వైసీపీ ఎమ్మెల్యే దళిత యువకునికి శిరోముండనం చేసినా ఆ పార్టీలోని దళిత నేతలు పట్టించుకోలేదు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ని కూడా వెనకేసుకొస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న మొత్తం 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. విదేశీ విద్యా నిధి పథకం రద్దు చేసి జగనన్న విద్యా పథకం అని మార్చారు. గతంలో లీడ్క్యాలప్ ద్వారా ఇచ్చే రుణాలు రద్దు చేశారు. వైసీపీ పాలనలో దళితులు అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయారు. జగన్ రెడ్డి మోసాలను దళితులు గ్రహిస్తూనే ఉన్నారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. దళిత హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. దళితులకు కేటాయించిన వేలకోట్ల సబ్ప్లా న్ నిధులను వైసీపీ నేతలు దారిమళ్లించారు.
టీడీపీ హయాంలో దళిత సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నిటినీ పునరుద్దరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దళిత గర్జన పేరు వినగానే అటు ప్రభుత్వం, ఇటు పోలీసుల చర్యలు మొదలైయ్యాయి. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్‌లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. విజయవాడకు బయలుదేరినవారిని కూడా అడ్డుకుని రాకుండా అడ్డుకున్నారు. దళిత గర్జనకు వెళ్లకుండా టీడీపీ నేతలు దేవినేని ఉమ, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, గద్దె రామ్మోహన్ తదితరులను గృహ నిర్బంధం చేశారు. విజయవాడ బయలుదేరిన నక్కా ఆనందబాబును పోలీసులు అడ్డుకోవడంతో గుంటూరులో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బాపట్లలో ఏలూరి సాంబశివరావు క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసుల మొహరించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు సురేష్ తదితరులను విజయవాడ వెళ్లడానికి ఆఫీస్ నుంచి బయటకు రాకుండా అడ్డకున్నారు. టీడీపీ ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, ఇతర నేతలు విజయవాడ ధర్నా చౌక్ దగ్గర వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని విజయవాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి. దాంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయవాడలో టీడీపీ దళిత గర్జనకు అనుమతి నిరాకరించడాన్ని వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా టీడీపీ నేతలు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఇది ఆరంభమే. ఇక్కడ ఒక్క దళితులే రంగంలోకి దిగారు. రానున్న రోజుల్లో దళితులే జగన్ రెడ్డికి బుద్ధి చెబుతారు. ఇక అన్ని వర్గాల ప్రజలు కథన రంగంలోకి దిగి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వంపై పోరాడటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం దీనిని దళితుల హెచ్చరికగా భావించి వారికి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పునరుద్ధరించడం మంచిది.