అంత్యక్రియలకు వెళ్లనీయకపోవడం అమానవీయం
హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం
హంతకులను బహిరంగంగా ఉరితీయండి
అమరావతి: కుటుంబ సభ్యుల అనుమతిలేకుండా పోలీసులే జల్లయ్య మృతదేహాన్ని బలవంతంగా రావులాపురం తరలించారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను సైతం పోలసులు బలవంతంగా బస్సుల్లో అక్కడికి తీసుకువెళ్లారని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు డీజీపీకి లేఖ రాశారు… పార్టీ కార్యకర్త జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను, టిడిపి బృందాన్ని పోలీసులు అరెస్టులతో అమానవీయంగా అడ్డుకున్నారని తెలిపారు. జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టిడిపి నేతలకు, అతని బంధువులను అనుమతించాలి. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే అసలు ఈ హత్యే జరిగేది కాదు. 2019 తరువాత ఒక్క మాచర్లలోనే 5గురు బిసి వర్గం వారిని హత్య చేశారు. అందులో 4గురు యాదవ సామాజికవర్గం వారే ఉన్నారు. పోలీసుల మద్దతుతోనే వైసిపి వరుస హత్యలతో టీడీపీ మద్దతుదారులను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. మాచర్లలో బిసి వర్గం పై జరుగుతున్న హత్యాంకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చెయ్యాలి. హంతకులకు మరణ శిక్ష విధించేలా పోలీసు శాఖ చర్యలు ఉండాలని చంద్రబాబునాయుడు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరివేయండి!
తెలుగు దేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు వరుసబెట్టి అరెస్టులు చెయ్యడంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. శనివారం ఆయన ఒకప్రకటన విడుదల చేస్తూ…పల్నాడు జిల్లాలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న నేతలను అరెస్టు చెయ్యడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఆపలేని పోలీసులు…అంత్యక్రియలకు వెళుతున్న వారికి ఆపడం, అరెస్టులు చెయ్యడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్త చనిపోతే….కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత గ్రామం జంగమేశ్వరపాడులో అంత్యక్రియలు జరిపే అవకాశం కూడా లేకుండా జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు తరలించడం అమానవీయమని చంద్రబాబు అన్నారు. కనీసం మృతదేహాన్ని ఎటుతరిలిస్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు చెప్పారా అని ప్రశ్నించారు. హత్యలతో వైసిపి నేతలు కిరాతకంగా వ్యవహరిస్తే….అక్రమ అరెస్టులతో పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పల్నాడును వల్లకాడు చేస్తున్నారని…మూడేళ్లలో ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 5 గురిని హత్య చేశారని, వందలమందిపై దాడులు చేశారని అన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్భలంతోనే హత్యలు జరుగుతున్నాయని…ఈ హత్యాకాండపై స్పెషల్ కోర్టు పెట్టి విచారణ చేసి నిందితులకు ఉరి శిక్షవెయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.