దళిత ద్రోహం నుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబుపై దాడి పన్నాగం
లోకేష్ పైనా ఆదేతరహాలో కుటిలయత్నాలు
టిడిపి హయాంలోనే దళితుల ఆత్మగౌరవం పెంపు, సాధికారత
జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులకనుగుణంగా 18 జీవోలు విడుదల చేసిన ఘనత చంద్రబాబుదే
వైసీపీ హయాంలో పధకాల రద్దు, దళితులపై దమనకాండ
తెలుగుదేశం పార్టీ అధినేత చందబాబు నాయుడును దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకే అధికార పార్టీ పధకం ప్రకారం దాడికి పాల్పడినట్టు అవగతం అవుతోంది. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా వున్న యర్రగొండపాలెం లో దాడికి పాల్పడటం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ లో వున్న చంద్రబాబుపై రాళ్ళదాడికి పాల్పడిన పక్షంలో ఆయనకు రక్షణగా వున్న ఎన్ ఎస్ జి కమాండోలు కాల్పులు జరిపే అవకాశముందని అంచనావేసి ఈ విధమైన పన్నినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఎన్ ఎస్ జీ కమాండో లు సంయమనంతో వ్యవహరించటంతో అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఈ పరిణామాల నేపధ్యంలో ఎవరు దళితద్రోహి అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు దళితుల సంక్షేమం కోసం ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు దోహదపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ పధకాలకు తిలోదకాలు ఇవ్వటమేగాక దళితులపై దమనకాండ చోటుచేసుకున్నది. వీటన్నింటినీ పక్కదోవ పట్టించేందుకే చంద్రబాబుపై దాడికి పాల్పడుతున్నట్టు అవగతం అవుతోంది.
టిడిపి హయాంలోనే దళిత అభ్యున్నతి
టిడిపి ప్రభుత్వ హయాంలో తొలుత ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రులుగా దళిత సంక్షేమానికి ఎన్నో పధకాలు అమలు చేశారు. ఎన్టీఆర్ తన తొలి కేబినెట్ లోనే దళితులకు సముచిత స్థానం కల్పించారు. అనంతరం చంద్రబాబు జీఎంసి బాలయోగి, ప్రతిభా భారతి వంటివారికి చట్టసభలలో అత్యున్నత స్థానం కల్పించటం ద్వారా ఆ వర్గాల గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ఎన్టీఆర్ కన్వీనర్ గా వున్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలోనే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు భారతరత్న వచ్చింది. చంద్రబాబు హయాంలో కాకి మాధవరావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ పదవి పొందిన తొలి దళిత వ్యక్తిగా మాధవరావు గుర్తింపు పొందారు. డాక్టర్ కె ఆర్ నారాయణన్ ను రాష్ట్రపతిగా ప్రతిపాదించారు.
అంతరానితనం నిర్మూలనకోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ ను 2001 లో ఏర్పాటు చేసిన చంద్రబాబు, దాని సిఫార్సుల ఆధారంగా 18 జీవో లను విడుదల చేశారు. అంతరానితనం, దళితులపై అత్యాచారాల నిరోధం, అత్యాచారాలు జరిగే అవకాశం వున్న ప్రాంతాలలో జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు, అత్యాచారం జరిగే అవకాశం వున్న ప్రాంతాలలో కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, డిఎస్పీ లు సందర్శించి సమీక్షించటం, నేరస్తులను శిక్షించేందుకు 10 సంవత్సరాల అనుభవం వున్న న్యాయమూర్తులతో ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు, అత్యాచార బాధితులకు నష్టపరిహారం తదితర అంశాలపై జీవోలు విడుదల చేశారు. ఎస్సీ రిజర్వేషన్ లను 14 నుంచి 15 శాతంకు, ఎస్టీ రిజర్వేషన్ లను 4 నుంచి 6 శాతం కు పెంపు టిడిపి హయాంలోనే జరిగింది. పదోన్నతులలో రిజర్వేషన్లు , గృహనిర్మాణంలో దళితులకు 50 శాతం రిజర్వేషన్, భూమి కొనుగోలు పధకం వంటి వాటిని చంద్రబాబు సమర్ధంగా అమలు చేశారు. అంబేద్కర్ విదేశీ విద్య, దళితులకు ఇన్నోవా కార్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించటం, 7 డీఎస్సీ లు నిర్వహించి వేలాదిమంది దళితుల్ని ఉపాధ్యాయులుగా చేయటం, అమరవతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు లైబ్రరీ, కన్వెంషన్ హాలు, స్మృతివనం ఏర్పాటు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ల ఏర్పాటు, రెసిడెన్షియల్ స్కూల్ ల విస్తరణ, వంటి కార్యక్రమాలు చంద్రబాబు హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. 1997 లోనే మేదక్ జిల్లా పెద్దిరెడ్డి పేట నుంచి అంతరానితనం కు వ్యతిరేకంగా చంద్రబాబు ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వైసీపీ చేసిందేమిటి?
దళితులకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందీ ఒక సారి పరిశీలన చేసుకోవలసిన అవసరం వుంది. టిడిపి హయాంలో ఇచ్చియన్ 27 దళిత పధకాలు రద్దు, 12వేల ఎకరాల దళితుల అసైన్డ్ భూములు బలవంతం స్వాధీనం, 33 వేలకోట్లు ఎస్సీ, ఎస్టీ రాజ్యాంగబద్ధ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించటం, కార్పొరేషన్ ల నిర్వీర్యం, అంబేద్కర్ విదేశీ విద్యలో అంబేద్కర్ పేరు తొలగించి ఆ మహనీయుడిని అవమానించటం, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీలకు రుణాలను కుదించి నామమాత్రంగా చేయటం, భూమి కొనుగోలు పధకం రద్దు, 50 వేల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా వుంచటం, బెస్ట్ అవైలబుల్ స్కూల్ ల రద్దు, ఇన్నోవా కార్ల పధకం రద్దు వంటి చర్యలకు పాల్పడింది. అదేవిధంగా దళితులపై దమనకాండ యధేచ్చగా కొనసాగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై చోటుచేసుకున్న సంఘటనల వివరాలు .
ఈ క్రింది విధంగా వున్నాయి.
1. డా. అచ్చెన్న (మార్చి 12, 2023) – కులం పేరుతో వేధించి హత మార్చారు.
2. సుబ్రమణ్యం (మే 20, 2022) – హత్య చేసి డోర్ డెలివరీ చేశారు.
3. నెల్లూరు నారాయణ (జూన్ 19, 2022) – దొంగతనం నిందవేసి స్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు.
4. కావలి కరుణాకర్ (సెప్టెంబర్, 2022) వైసీపీ నేతలు వేధింపులతో ఆత్మహత్య
5. దోమతోటి విక్రమ్(జూన్, 2020) – హైదరాబాద్ లో పనిచేసుకుంటున్న కిరణ్ పిలిపించి దారుణంగా హత్య చేశారు.
6. చీరాల కిరణ్ (ఆగష్టు, 2020) మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపటం
7. డాక్టర్ సుధాకర్ (మే 17, 2020) కరోనా మాస్కులు అడిగినందుకు మానసిక రోగిని చేసి చనిపోయేలా చేశారు.
8. నాగమ్మ (09.12.2020) సి.ఎం సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారం, హత్య
9. అనూష (డిసెంబర్, 2019) నెల్లూరు ఉదయగిరికి చెందిన దళిత యువతి అనూష అత్యాచారం, హత్య.
10. ఓం ప్రతాప్ (ఆగష్టు 26, 2020) మద్యం ధరలు ప్రశ్నించినందుకు హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించారు.
11. వర ప్రసాద్ (జూలై 21, 2020) అక్రమ ఇసుక దందాను ప్రశ్నించినందుకు శిరోముండనం.
12. డాక్టర్ అనితారాణి (జూన్, 2020) – మహిళ డాక్టర్ ను వైకాపా నేతలు నిర్భంధించి, వేధించి, అసభ్యపదజాలంతో దూషించారు.
13. రాజమండ్రిలో 10వ తరగతి దళిత బాలికపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ వైకాపా
14. సి.ఎం నివాసానికి కూతవేటు దూరంలో దళిత యువతిపై గ్యాంగ్ ముఠానాయకుడుని ఇప్పటికీ అరెస్టు చేయలేదు.
15. అనంతపురంలో దళిత యువతిపై అత్యాచారం, హత్య.
వైసీపీ అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న ఈ సంఘటనలతో ప్రభుత్వ, అధికార పార్టీ ప్రతిష్ట మసకబారింది. దళితవర్గాలలో సానుభూతి తిరిగి ప్రోది చేసుకునేందుకు చందబాబును దళితద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి భంగపడినట్టు స్పష్టం అవుతోంది.
అనుమానాలెన్నో …
యర్రగొండపాలెం ఘటనలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రతిపక్షనేత రోడ్ షోకు నిరసన తెలిపే వైకాపా రౌడీలను ముందస్తు అరెస్టులు ఎందుకు చేయలేదు? ప్రతిపక్షనేత చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతించారు. అనుమతించిన పోలీసులకు రక్షణ కల్పించే బాధ్యత లేదా? చంద్రబాబు ఎర్రగొండపాళెంకు వచ్చే 4 గంటల ముందే వైకాపా రౌడీలు చేయబోయే దాడి వారి ఏర్పాట్లు తెలియజేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ, డీజీపీ గార్లకు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మెసేజ్ పెట్టారు. చీటికి మాటికి ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులుఅవాంఛనీయ ఘటనలకు పాల్పడుతారని అనుమానం వున్న వైసీపీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్ రెడ్డి రోడ్ షోలకు ప్రతిపక్షాల నిరసనలను అనుమతిస్తారా? మరి ప్రతిపక్షనేత రోడ్ షోకు ఎలా అనుమతించారు.వంటి అనుమానాలు తలెత్తుతున్నాయి.
చంద్రబాబు పై 10సార్లు దాడి
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు పై గడచిన నాలుగేళ్ల కాలంలో మొత్తం పది సార్లు దాడి జరిగినట్టు వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో వున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుని పైనే ఈ విధమైన దాడి జరిగితే ఇక సామాన్యుల పరిస్తితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.
1. ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రాళ్ల దాడి.
2. జోగి రమేష్ తో ప్రతిపక్షనేత ఇంటిపైన దాడి.
3. ఛలో ఆత్మకూరు వెళ్లకుండా ఇంటికి తాళ్లు కట్టడం.
4. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి
5. నందిగామ టూర్ పై దాడి.
6. తిరుపతి ఉపఎన్నికల సందర్బంలో రాళ్ల దాడి.
7. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటనకు వెళ్లిన సంధర్భంలో రాళ్ల దాడి.
8. విజయనగరంలో రామతీర్ధంకి వెళ్లిన సంధర్బంలో దాడి.
9. 2020 ఫిబ్రవరిలో ప్రజాచైతన్య యాత్రకు వెళ్లన సంధర్భంలో విశాఖపట్నం విమానాశ్రయంలో దాడికియత్నం.
10. 2019 నవంబర్ లో అమరావతి నిర్మాణాలను మీడియాకు చూపేందుకు వెళుతుండగా రాళ్లు, చెప్పులతో దాడి.
లోకేష్ పైనా అదే తరహాలో …
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన సైతం అదే తరహాలో ప్రచారానికి అధికార పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. తనపై జరుగుతున్న ప్రచారాలపై లోకేష్ ఘాటుగానే స్పందించి సవాల్ చేస్తే దానిని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం గమనార్హం. దళితులను లోకేశ్ అవమానించాడని వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తుంది. దళితులను అవమాన పరిచినట్లు నిరూపిస్తే రాజకీయాలకు నుంచి తప్పుకుంటాన్న లోకేష్ సవాల్ స్వీకరించాలి లేదా దళితులకు క్షమాపణ చెప్పాలని టిడిపి వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దళితుల సంక్షేమం కోసం జగన్ ఏం చేశాడని అంబేద్కర్ పేరు తీసేసి విదేశీ విద్యకు జగన్ పేరు పెట్టారని నారా లోకేష్ ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆధారాలుంటే చూపమని నారా లోకేష్ చేసిన సవాల్ ను వైసీపీ నేతలు, సాక్షి మీడియా స్వీకరించకుండా పారిపోయి అబద్ధాలు పదేపదే మాట్లాడుతూ దళితుల విజ్ఞతను తక్కువగా అంచనా వేస్తున్నారు. లోకేష్ అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి సాక్షిలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ సవాల్ ను వైసీపీ నాయకులు స్వీకరించని పక్షంలో దళితులను అడ్డుపెట్టుకొని వారంతా రాజకీయం చేస్తున్నట్టు భావించాల్సి వస్తుంది.